
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలల్లోని వైమానిక సేవల సంస్థలకు భారీ నష్టం వాటిల్లనుంది. రష్యాపై విధించిన భారీ ఆంక్షల ప్రతికూల ప్రభావం పశ్చిమదేశాల కంపెనీలపై కూడా పడుతోంది. వందల కొద్దీ విమానాలను కోల్పోయే పరిస్థితి పలు కంపెనీలకు తలెత్తింది. దీంతో ఆ కంపెనీలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే కరోనా కారణంగా తీవ్ర నష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలపై ఈ యుద్ధం పిడుగులా పడింది.
గత నెల చివర్లో ఐరోపా సమాఖ్య, యూకే, అమెరికా, కెనడా దేశాల కంపెనీలు ఆయా ప్రభుత్వాల ఆదేశాల మేరకు రష్యాతో ఉన్న విమానాల లీజింగ్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. తమ విమానాలు వెనక్కి తెచ్చుకోవడానికి 30 రోజుల సమయం ఇచ్చారు. అంటే మార్చి 28 నాటికి రష్యాకు లీజ్‌కిచ్చిన పౌర విమానాలను పశ్చిమ దేశాల కంపెనీలు వాపస్ తీసకోవాల్సి ఉంది. మొత్తం 523 విమానాలను రష్యాలోని విమానయాన సేవల సంస్థలకు లీజుకు ఇచ్చారు. వీటిల్లో ఎస్7 ఎయిర్‌లైన్స్ 101 విమానాలు, ఏరోఫ్లోట్ 89, ఏరోక్యాప్ సంస్థ 142 విమానాలను లీజుకు ఇచ్చినట్లు తేలింది. ఈ విమానాల మొత్తం విలువ దాదాపు 12 బిలియన్ డాలర్లకు పైమాటే.
దీంతో మార్చి 28 డెడ్‌లైన్ దగ్గరపడే కొద్దీ విమానయాన సంస్థల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మార్చి 9 నాటికి కేవలం 24 విమానాలను మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. కానీ, వీటిల్లో కూడా చాలా వాటికి సంబంధించిన రికార్డులు రష్యాలోని విమానయాన సంస్థల వద్దే ఉన్నాయి. ఫలితంగా ఇవి కూడా పెద్దగా ఉపయోగపడని పరిస్థితి నెలకొంది.
ఒలిగార్క్‌ల ఆస్తులను పశ్చిమ దేశాలు స్తంభింపజేయడంపై గుర్రుగా ఉన్న రష్యా.. ఈ లీజుల రద్దు, విమానాలు వెనక్కి పంపే ప్రక్రియను వీలైనంత కఠినతరంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. రష్యాకు చెందిన నియంత్రణ సంస్థ రోసావియాట్సియా దేశ గగనతలంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలను మరింత బిగించింది. దీంతో లీజులో ఉన్న విమనాలు వెనక్కి తీసుకువెళ్లడం సవాలుగా మారింది. ‘‘విమానాలను శాశ్వతంగా వదులుకొనే పరిస్థితి తలెత్తుతుందన్నదే అతిపెద్ద భయంగా మారింది’’ అని విమానాల రికవరీ సేవలు అందించే నొమాడిక్ ఏవియేషన్ ఎండీ స్టీవ్ గియోర్డానో అభిప్రాయపడ్డారు. రష్యా ఆయా కంపెనీలకు డబ్బుచెల్లించి విమానాలను కొనుగోలు చేయాలన్నా.. ప్రస్తుత ఆంక్షల కారణంగా చెల్లింపులు దుర్లభమవుతాయి.
స్పేర్ పార్టులుగా మార్చేస్తుందేమో..
బోయింగ్, ఎయిర్ బస్ వంటి సంస్థలు రష్యాతో సంబంధాలు తెంపుకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశానికి సదరు విమాన తయారీ సంస్థల నుంచి ఎటువంటి విడి భాగాలు, సర్వీసులు అందవు. దీంతో రష్యా వద్ద ఉన్న ఆయా కంపెనీల విమానాలు కొన్నాళ్ల తర్వాత విడిభాగాలు లేక మూలన పడే పరిస్థితి వస్తుంది. ఈ విమానాలకు రష్యా బయట సర్వీసులు చేయించాలన్న సాధ్యంకాదు. ఎందుకంటే చుట్టుపక్కల దేశాల్లో చాలా వరకు రష్యా విమానాల రాకపోకలకు గగనతలాన్ని మూసివేశాయి.
ఈ క్రమంలో రష్యా విడిభాగాల పంపిణీదారులను ఇతర దేశాల్లో వెతుక్కోవాలి. చైనా వంటి దేశాల నుంచి మూడో కంటికి తెలియకుండా విడిభాగాలను నిరంతరం తెప్పించుకోవాలి. ఒక వేళ ఆంక్షల భయం కారణంగా ఆయా దేశాలు నిరాకరిస్తే.. విదేశీ నిపుణులను తెప్పించుకొని సొంతగానే సర్వీసు, మెయింటెనెన్స్ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి.
ఇప్పటికే రష్యా గడ్డపై నిలిచిపోయిన లీజు విమానాల్లో కొన్నింటిని విడిభాగాల కోసం వాడుకొనే అవకాశం ఉంది. ఇలా సేకరించిన విడిభాగాలను మిగిలిన విమానాలకు వాడి.. వాటిని గాల్లోకి ఎగిరే స్థితిలో కొనసాగిస్తుంది. ఇదే జరిగితే లీజు కంపెనీలు ఈ విమానాలను రైటాఫ్ చేసుకోవడం మినహా మరో మార్గంలేదు.
Home
»
»Unlabelled
» Ukraine Crisis: వందల కొద్దీ విమానాలను ఇక వదిలేసుకోవడమేనా..?
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment