విజయపుర, బెంగళూరు గ్రామీణ, న్యూస్‌టుడే : మూడుముళ్ల బంధం కావాలని ఆమె కోరినందుకు అప్పటి వరకు ప్రాణంగా చూసుకుంటానని హామీల్ని గుప్పించిన ప్రియుడే రగిలిపోయాడు. ఆమెపై నిప్పులు చెరిగాడు. అతడి కర్కశానికి కాలిన గాయాల పాలై.. మృత్యువుతో పోరాడిన దానేశ్వరి అనే యువతి చివరికి కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటన బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆమె శరీరంపై పెట్రోల్‌పోసి నిప్పటించిన ప్రియుడు శివకుమార్‌ పరారయ్యాడు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. విజయపుర జిల్లాకు చెందిన దానేశ్వరి, శివకుమార్‌ ఇంజినీరింగ్‌ చదివే సమయంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చదువు పూర్తయిన తరువాత ఉపాధి కోసం బెంగళూరు చేరుకున్నారు. నగరంలోని వేర్వేరు కంపెనీల్లో వారికి ఉద్యోగాలు వచ్చాయి. ఇక ప్రేమకు స్వస్తిచెప్పి వివాహం చేసుకుందామని దానేశ్వరి తన ప్రియుడిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. అప్పటి వరకు ప్రేమను కొనసాగించిన శివకుమార్‌ ఆలోచనల్లో, మాటల్లో మార్పులొచ్చాయి. తమవి వేర్వేరు కులాలైనందున వివాహం చేసుకోవడం సాధ్యం కాదని తెగేసి చెప్పాడట. ఈవిషయమై మరింత ఒత్తిడి తీసుకువచ్చి ఒప్పించాలని ఆమె ఎంతగానో ప్రయత్నించారని బంధువులు వివరించారు. ఇందులో భాగంగానే శివకుమార్‌ పనిచేసే ఎలక్ట్రానిక్‌ సిటీ ప్రాంతంలోని వీరసంద్రలోని సంస్థ వద్దకు బుధవారం ఆమె వెళ్లి ప్రశ్నించినట్లు తెలిపారు. ఇందుకోసమే ఎదురుచూస్తున్న శివకుమార్‌ ఆమెతో మాట్లాడుతూనే.. ఓ చోటకు తీసుకెళ్లి తనవెంట తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని సమాచారం. కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న దానేశ్వరిని తానే ఆసుపత్రికి తరలించి పరారయ్యాడు. చికిత్స పొందుతూ దానేశ్వరి శుక్రవారం కన్నుమూశారు. ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు. 

* దానేశ్వరికి వివాహ ప్రయత్నాలు చేస్తుండగా తాను శివకుమార్‌ను ప్రేమించిన విషయం చెప్పిందని ఆమె తండ్రి అశోక్‌ శర్మ కన్నీరు మున్నీరయ్యారు. ఈ నేపథ్యంలోనే వివాహ ప్రయత్నాల్ని విరమించుకున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈనెల 16న దానేశ్వరిని సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందని వాపోయారు. ఇదే విషయాన్ని వెంటనే బెంగళూరుకు వచ్చిన తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై చర్యలు తీసుకోవడానికి బదులు తమనే దోషులుగా చూశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

Post a Comment

 
Top