అవకాశం వ‌స్తే ఆర్టీసీ డ్రైవ‌ర్ కొలువు చేస్తానంటున్న కరీంన‌గ‌ర్ ఆడ‌బిడ్డ‌.. ఎందుకంటే

Kavitha | చిన్న వయసులోనే సైకిల్‌, బైక్‌ నడపడం నేర్చుకున్నది కవిత. బాల్యం నుంచీ ఆమెకు వాహనాలంటే ఇష్టం. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని నుస్తులాపూర్‌ ఆమె స్వగ్రామం. అమ్మానాన్నలు మేదరి పనిచేస్తారు. రోజంతా చేటలు, బుట్టలు అల్లుతారు. కవిత వాళ్ల నాన్నకు మోటర్‌ సైకిల్‌ ఉండేది. ఎవరికీ చెప్పకుండా దాని గేర్‌ మార్చడం, యాక్సలరేటర్‌ పెంచడం నేర్చుకున్నది తను. అంతేనా, ఆ బండిని రోడ్డుపై దౌడు తీయించేది. కొన్నాళ్లకు ఇంట్లోవాళ్లు ఆటో కొన్నారు. ఆ మూడు చక్రాల వాహనాన్ని కూడా ముచ్చటగా మళ్లించేది.

‘ఇదేం ఇచ్చంత్రం.. ఆడపిల్ల ఆటో నడుపుడేంది?’ అని అందరూ విచిత్రంగా చూశారు. అలా అని, కవిత చదువుల్ని నిర్లక్ష్యం చేయలేదు. బీకామ్‌ చదివింది.
డిగ్రీ అయ్యాక ప్రైవేట్‌ హాస్టల్‌లో వార్డెన్‌గా పనిచేస్తూ, కరీంనగర్‌లోని ఓ డ్రైవింగ్‌ స్కూల్‌లో చేరింది. లైట్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ నేర్చుకున్నది. ఆ తర్వాత హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ నేర్చుకోవాలని అనుకుంది. నేర్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. సిరిసిల్ల దగ్గర మండేపల్లిలో ఉన్న ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్స్‌’ ప్రిన్సిపల్‌ను కలిసింది. కవితను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ‘నీకు తప్పకుండా నేర్పిస్తాం. వచ్చే బ్యాచ్‌లో చేర్చుకుంటా’ అని మాటిచ్చాడు. చెప్పినట్టే సీటిచ్చాడు. బ్యాచ్‌లో ఎనభైమంది వరకూ ఉన్నారు. అందరూ అబ్బాయిలే, ఒక్క కవిత తప్ప! ఏప్రిల్‌లో కోర్సు పూర్తవుతుంది. ఇక రవాణా శాఖ నుంచి కవిత హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవచ్చు. ‘ఆ తర్వాత ఏమిటి?’ అంటే.. ఎటూ లారీలు నడపడానికి ఇవ్వరు. వీలుంటే ఊళ్లో ట్రాక్టర్‌ నడుపుతానంటున్నది. ఏడాది తర్వాత అవకాశం వస్తే.. ఆర్టీసీలో డ్రైవర్‌ కొలువు చేస్తానంటున్నది కవిత.

Post a Comment

 
Top