Petrol Price | పెట్రోల్ ధ‌ర‌లో స‌గం స‌ర్కారీ ఖ‌జానాలోకే.. 8 ఏండ్ల‌లో 13 రెట్లు సుంకాల పెంపు!

Petrol Price | రోజురోజుకు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. కానీ సామాన్యుడి ఆదాయం మాత్రం అందుకు త‌గ్గ‌ట్లు పెర‌గ‌డం లేదు. గ‌త మూడేండ్లుగా స‌గ‌టు భార‌తీయుడి ఆదాయం క్ర‌మంగా త‌గ్గుతున్న‌ది. కానీ కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజిల్‌ల‌పై ప‌న్ను వ‌సూలు చేస్తూ రూ. ల‌క్ష‌ల కోట్ల‌లో ఆదాయం స‌మ‌కూర్చుకుంటున్న‌ది. ఆమ్‌దానీ (ఆదాయం) ఆటానా (అర్థ‌రూపాయి) ఖ‌ర్చు రూపాయ‌ సినిమా డైలాగ్‌.. స‌గ‌టు భార‌తీయుడికి స‌రిగ్గా స‌రిపోతుంది. ఈ రోజు మీరు రూ.100 పెట్రోల్ కోసం ఖ‌ర్చు చేస్తే అందులో రూ.52 స‌ర్కారీ ఖ‌జానాలోకే చేరుతుంది. సామాన్యుడి జేబులు ఖాళీ అవుతుంటే.. అంతే వేగంగా ప్ర‌భుత్వాలు ఖ‌జానా నింపుకుంటున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం నిజంగా ప్ర‌జ‌ల‌పై ధ‌ర‌ల భారం త‌గ్గించాల‌ని కోరుకుంటే ప‌న్నులో కోత విధిస్తుంది.

ముంబై, ఢిల్లీల్లో ఇలా

ఉదాహ‌ర‌ణ‌కు మ‌హారాష్ట్రలో స‌గ‌టు పౌరుడు రూ.100 పెట్రోల్ కోసం ఖ‌ర్చు చేస్తే, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఖ‌జానాల్లోకి రూ.52.50 వెళ్లిపోతుంది. అదే దేశ రాజ‌ధాని ఢిల్లీ వాసి రూ.100 ఖ‌ర్చు చేస్తే, స‌ర్కారీ ఖ‌జానాలోకి రూ.45.3 వెళుతుంది. ప్రస్తుతం పెట్రోల్ ధ‌ర రెట్టింపు కంటే ఎక్కువ ఖ‌ర్చుతో కూడుకున్న‌ది. ప్ర‌స్తుతం లీట‌ర్ పెట్రోల్ బేస్ ధ‌ర రూ.49.. దాంతోపాటు ఎక్సైజ్ డ్యూటీ రూ.27.90.. అటుపై రాష్ట్ర ప్ర‌భుత్వం వ్యాట్, సెస్ వ‌డ్డిస్తాయి. ఫ‌లితంగా బేస్ ధ‌ర‌కంటే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర మూడు రెట్లు పెరుగుతున్న‌ది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌న్నుల్లో రిలీఫ్ ఇవ్వ‌కుండా పెట్రోల్ ధ‌ర త‌గ్గించ‌డం సాధ్యం కాద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

ఇలా పెట్రోల్‌, డీజిల్ బేస్ ధ‌ర‌లు

పెట్రోల్ లీట‌ర్ బేస్ ధ‌ర రూ.47.99, ఫేర్ 25 పైస‌లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.27.90, డీల‌ర్ క‌మిష‌న్ రూ.3.77, రాష్ట్ర ప్ర‌భుత్వ వ్యాట్ రూ.15.50 క‌లుపుకుని మొత్తం రూ.95.41 అవుతుంది. లీట‌ర్ డీజిల్ బేస్ ధ‌ర రూ.49.34, ఫేర్ 28 పైస‌లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.21.80, డీల‌ర్ క‌మిష‌న్ రూ.2.57, రాష్ట్ర ప్ర‌భుత్వ వ్యాట్ రూ.12.68తో క‌లిపి మొత్తం రూ.85.67కి చేరుతుంది. ఈ ధ‌ర‌లు ఈ నెల 16న ఢిల్లీలో రికార్డ‌యిన‌వి. రోజువారీగా పెరుగుతున్న ధ‌ర‌ల‌కు అనుగుణంగా ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ పెరుగుతాయి.

కేంద్ర ఖ‌జానాకు రూ.8 ల‌క్ష‌ల ఇన్‌కం

మూడేండ్ల‌లో పెట్రోల్‌, డీజిల్‌ల‌పై ఎక్సైజ్ సుంకం, సెస్‌ల‌ను విధించ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం రూ.8 ల‌క్ష‌ల కోట్ల నిధులు స‌మ‌కూర్చుకుంది. కానీ స‌గ‌టు భార‌తీయుడి ఆదాయం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప‌డిపోయింది. గ‌త మూడేండ్ల‌లో స‌గ‌టు భార‌తీయుడి త‌ల‌స‌రి వ్య‌క్తిగ‌త వార్షిక ఆదాయం రూ.1.26 ల‌క్ష‌ల నుంచి రూ.99,155ల‌కు ప‌డిపోయింది. ప్ర‌భుత్వ ఖ‌జానా.. ఎక్సైజ్ సుంకం రూపేణా రూ.2,10,282 కోట్ల నుంచి రూ.3,71,908 కోట్ల ఆదాయం పెంచుకున్న‌ది. ఈ ర‌కంగా పెట్రోల్‌, డీజిల్‌ల‌పై ఎక్సైజ్ సుంకాల‌ను పెంచ‌డంతో కేంద్ర ఖ‌జానాకు రూ.8 ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయం ల‌భించింది.

ఎక్సైజ్ సుంకం ఇలా పెంపు

మోదీ ప్ర‌భుత్వం పెట్రోల్‌పై మూడు రెట్లు, డీజిల్‌పై ఆరు రెట్లు ఎక్సైజ్ సుంకం పెంచేసింది. 2014లో మోదీ కేంద్రంలో ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టినప్పుడు లీట‌ర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.10.38, లీట‌ర్ డీజిల్‌పై రూ.4.52 ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వ‌సూలు చేసేవారు. 2014లో కేంద్రంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ల‌పై ఎక్సైజ్ సుంకం 13 రెట్లు పెంచి.. నాలుగు రెట్లు త‌గ్గించింది. ప్ర‌స్తుతం లీట‌ర్ పెట్రోల్‌పై రూ.27.90, లీట‌ర్ డీజిల్‌పై రూ.21.80 ఎక్సైజ్ డ్యూటీ అమ‌ల్లో ఉంది.

Post a Comment

 
Top