Sri Lanka Meltdown | పీక‌ల్లోతు క‌ష్టాల్లో శ్రీ‌లంక‌.. భార‌త్‌కు వ‌ల‌స క‌డుతున్న‌ లంకేయులు!

Sri Lanka Meltdown | భారీ విద్యుత్ కోత‌.. నిత్యావ‌సర వ‌స్తువుల కొర‌త‌.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. నిండుకున్న విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు.. ఇదంతా మ‌న పొరుగుదేశం శ్రీ‌లంక ఎదుర్కొంటున్న దారుణ ప‌రిస్థితులు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా శ్రీ‌లంక దారుణ‌మైన ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌ది. ధ‌ర‌లు భారీగా పెంచినా.. త‌మ‌కు అవ‌స‌ర‌మైన పెట్రోల్ కోసం వేల‌ల్లో వాహ‌న‌దారులు పెట్రోల్ బంకుల.. నిత్యావ‌స‌రాల కోసం షాపుల‌ వ‌ద్ద బారులు తీర‌డం నిర‌స‌న‌ల‌కు దారి తీసింది. శ‌నివారం నుంచి పెట్రోల్ బంకుల వ‌ద్ద బారులు తీరిన వారిలో ముగ్గురు వృద్ధులు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్ధం ప‌డుతున్న‌ది.

రామేశ్వ‌రం వ‌ద్ద ఆరుగురి అరెస్ట్‌

సాధార‌ణ పౌరులు జీవ‌నం సాగించ‌డ‌మే క‌ష్టంగా మారింది. ఉపాధి లేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో లంకేయులు బ‌తుకు జీవుడా అంటూ భార‌త్‌కు మూకుమ్మ‌డిగా వ‌ల‌స‌లు వ‌చ్చేస్తున్నారు. మంగ‌ళ‌వారం ముగ్గురు పిల్ల‌ల‌తోపాటు ఆరుగురు శ్రీ‌లంక పౌరుల‌ను త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రం వ‌ద్ద ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్ జ‌వాన్లు అదుపులోకి తీసుకున్నారు. వీరు జాఫ్నా, కొకుపాడైన్ ప్రాంతాల వారు. తాము ఆహార కొర‌త‌, ఉద్యోగాల్లేక పారిపోయి వ‌చ్చామ‌ని చెప్పారు.

పెట్రోల్ బంకుల వ‌ద్ద సైన్యం

నిర‌స‌న‌ల‌ను అడ్డుకునేందుకు శ్రీ‌లంక ప్ర‌భుత్వం పెట్రోల్ బంకుల వ‌ద్ద సైనిక బ‌ల‌గాల‌ను మోహ‌రించింది. నిత్యావ‌స‌ర వ‌స్తువుల కొర‌త‌తో వాటి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు ప‌డిపోవ‌డంతో పెట్రోల్‌, డీజిల్ ఇత‌ర చ‌మురు ఉత్ప‌త్తుల ధ‌ర‌లు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోయాయి.

ప‌రీక్ష‌ల‌న్నీ నిర‌వ‌ధిక వాయిదా

దేశ ఆర్థిక ప‌రిస్థితి దెబ్బ‌తిన‌డం విద్యార్థుల‌పై తీవ్రంగా ప‌డింది. కాగితం కొర‌త‌తో అన్ని ప‌రీక్ష‌లు నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు శ్రీ‌లంక సర్కార్ ప్ర‌క‌టించింది. విదేశీ క‌రెన్సీ కొర‌త‌తో దిగుమ‌తుల‌కు నిధులు స‌మ‌కూర్చ‌లేక ట్రేడ‌ర్లు చేతులెత్తేశారు. శ్రీ‌లంక‌కు విదేశీ మార‌క ద్ర‌వ్యం రావాలంటే ప‌ర్యాట‌క‌మే కీల‌కం. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప‌ర్యాట‌క రంగం పూర్తిగా దెబ్బ తిన్న‌ది.

చైనా నుంచి ఇష్టారాజ్యంగా రుణాలు

మ‌రోవైపు, దేశంలోని మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌కు చైనా నుంచి ఇబ్బ‌డిముబ్బ‌డిగా.. నిర్ల‌క్ష్య పూరితంగా తెచ్చుకున్న రుణాలు త‌డిసిమోపెడ‌య్యాయి. అంత‌కుముందు 2019లో ఈస్ట‌ర్ నాడు కొలంబో వ్యాప్తంగా బాంబు పేలుళ్ల‌తో దేశ ప‌ర్యాట‌కం దెబ్బ తిన్న‌ది. ఫ‌లితంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా కునారిల్లిపోయింది. విదేశీ మార‌క ద్ర‌వ్యం నిల్వ‌లు అడుగంటిపోయాయి.

అన్నింటికీ దిగుమ‌తులే ఆధారం

పంచ‌దార‌, ప‌ప్పులు, తృణ ధాన్యాలు, ఫార్మాస్యూటిక‌ల్స్ స‌హా ప్ర‌తి నిత్యావ‌స‌ర వ‌స్తువుల కోసం దిగుమ‌తుల‌పైనే ఆధార ప‌డ‌టం శ్రీ‌లంక‌పై మూలిగే న‌క్క‌పై తాటి కాయ ప‌డ్డ‌ట్ల‌యింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. దిగుమ‌తి బిల్లులు చెల్లించ‌లేక‌పోవ‌డంతో నిత్యావ‌స‌ర వ‌స్తువుల కొర‌తకు దారి తీసిందంటున్నారు.

ఆదుకునేందుకు డ్రాగ‌న్ స‌సేమిరా

విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో శ్రీ‌లంక‌ను ఆదుకునేందుకు చైనా నిరాక‌రించింది. క‌రోనా మ‌హ‌మ్మారితో ప‌ర్యాట‌క రంగం దెబ్బ తిన్నందున శ్రీ‌లంక‌కు ఇచ్చిన రుణాల‌ను రీషెడ్యూల్ చేయ‌డానికి స‌సేమిరా అన్న‌ద‌ని వార్త‌లొచ్చాయి. ఈ ద‌శ‌లో పొరుగుదేశం శ్రీ‌లంక‌ను ఆదుకునేందుకు భార‌త్ ముందుకు వ‌చ్చింది. ఆహార ధాన్యా, ఔష‌ధాలు, ఇత‌ర నిత్యావ‌స‌ర వ‌స్తువుల కొనుగోలు కోసం ఈ నెల 17న 100 కోట్ల డాల‌ర్ల రుణం ప్ర‌క‌టించింది. గ‌త నెల‌లో పెట్రోలియం ఉత్ప‌త్తుల కొనుగోలుకు 500 మిలియ‌న్ల డాల‌ర్ల రుణం ఇచ్చింది.

ఐఎంఎఫ్ శ‌ర‌ణుజొచ్చిన శ్రీ‌లంక‌

త‌మ దేశాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బెయిల్ ఔట్ ఇవ్వాల‌ని అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌)ను కోర‌నున్న‌ట్లు శ్రీ‌లంక అధ్య‌క్షుడు గోట‌బ‌య్యా రాజ‌ప‌క్ష ప్ర‌క‌టించారు. విదేశీ రుణాలు, సావ‌రిన్ బాండ్ల చెల్లింపున‌కు 690 కోట్ల డాల‌ర్ల రుణం మంజూరు చేయ‌డానికి కొత్త ప‌ద్ద‌తి క‌నుగొనాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గ‌త‌వారం ఐఎంఎఫ్‌ను గోట‌బ‌య్యా అభ్య‌ర్థించారు. 

Post a Comment

 
Top