నేడు రేపు భారత్‌ బంద్‌

  • కేంద్ర కార్మిక సంఘాల పిలుపు
  • టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం మద్దతు
  • కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన
  • బ్యాంకు, రవాణా సేవలపై ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ, మార్చి 27: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల ఫోరం రెండు రోజులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. సోమ, మంగళవారం కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొని ప్రదర్శనలు నిర్వహించనున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించింది. ఫలితంగా రెండు రోజులు బ్యాంకుల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండవు. ‘సోమ, మంగళవారాల్లో బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం ఏర్పడవచ్చు’ అని ఎస్బీఐ సహా అనేక బ్యాంకులు తెలిపాయి. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొంటున్నట్టు పేర్కొన్నాయి. బ్యాంకు ఉద్యోగులతో పాటు ఉక్కు, చమురు, టెలికం, బొగ్గు, పోస్టల్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కలిపి మొత్తం 20 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. బంద్‌ కారణంగా బ్యాంకింగ్‌, రవాణా, రైల్వే, విద్యుత్తు సర్వీసులపై ప్రభావం పడనున్నది.

కేంద్రం విధానాలు ప్రజా వ్యతిరేకమైనవి

కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్ల సంయుక్త ఫోరం ఆరోపించింది. ‘కేంద్రం విధానాలు కార్మిక వ్యతిరేకమైనవి. రైతు వ్యతిరేకమైనవి. ప్రజా వ్యతిరేకమైనవి. దేశ వ్యతిరేకమైనవి’ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇదిలా ఉండగా, బంద్‌లో పాల్గొనకుండా హర్యానా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలు అక్కడి ఉద్యోగులు, కార్మికులపై ఎస్మా ప్రకటించాయి. అయినప్పటికీ అక్కడి సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.

దేశవ్యాప్త సమ్మెకు టీఎన్జీవోస్‌ మద్దతు

సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్టు టీఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధానకార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

సమ్మె సక్సెస్‌ చేద్దాం: టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం

హైదరాబాద్‌, మార్చి 27(నమస్తే తెలంగాణ): రెండు రోజుల భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నిర్ణయించింది. బీఎంఎస్‌ మినహా రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. సమ్మెను సక్సెస్‌ చేయడంపై టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం గత వారం అన్ని ట్రేడ్‌ యూనియన్లతో సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడారు. ‘అందరం కలిసి సమ్మెను విజయవంతం చేద్దాం’ అని పిలుపు ఇచ్చారు. సమ్మెకు మద్దతునిస్తున్నట్టు యూసీసీఆర్‌ఐ(ఎంఎల్‌) కార్యదర్శి వినోద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ట్రేడ్‌ యూనియన్ల డిమాండ్లు

  • కార్మిక చట్టాలకు సవరించిన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి.
  • ప్రైవేటీకరణను ఆపాలి.
  • నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను రద్దు చేయాలి.
  • గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలి.
  • కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులరైజ్‌ చేయాలి. బ్యాంకు ఉద్యోగుల సంఘం డిమాండ్లు
  • బ్యాంకుల ప్రైవేటీకరణ మానుకోవాలి.
  • ప్రభుత్వ బ్యాంకుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి.
  • సిబ్బందికి పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించాలి
  • అప్పులను వేగంగా రికవరీ చేయడానికి చర్యలు తీసుకోవాలి.
  • వినియోగదారులపై సర్వీసు చార్జిని తగ్గించాలి

Post a Comment

 
Top