అపార్ట్‌మెంట్‌ డోర్‌ వద్ద పోలీసులు… ఏడవ అంతస్తు నుంచి దూకిన ఐదుగురు

మాంట్రీక్స్: అపార్ట్‌మెంట్‌ డోర్‌ వద్ద పోలీసులను చూసి ఆ ఇంట్లోని ఐదుగురు కుటుంబ సభ్యులు, అనుమానాస్పదంగా ఏడవ అంతస్తు నుంచి కిందకు దూకారు. నలుగురు మరణించగా ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్విట్జర్లాండ్‌లోని మాంట్రీక్స్‌లో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఒక కుటుంబం చాలా కాలంగా స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నది. వారికి నివాస గుర్తింపు కూడా ఉన్నది.

కాగా, గురువారం ఉదయం 7 గంటలకు వారి ఇంటి వద్దకు ఇద్దరు పోలీసులు వచ్చారు. అపార్ట్‌మెంట్‌ డోర్‌ తట్టారు. ఎవరు అని ఆ ఇంట్లోని వారు అడిగారు. పోలీసులమని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు వెంటనే ఏడవ అంతస్తులోని తమ అపార్ట్‌మెంట్‌ బాల్కానీ నుంచి కిందకు దూకారు. 40 ఏండ్ల వ్యక్తి, 41 ఏండ్ల ఆయన భార్య, ఆమె కవల సోదరి, 8 ఏండ్ల కుమార్తె మరణించారు. 15 ఏండ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది.

మరోవైపు పోలీసులను చూసిన వెంటనే ఆ కుటుంబ సభ్యులు అనుమానాస్పదంగా అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌ ఏడవ అంతస్తు నుంచి ఎందుకు దూకారు అన్నది మిస్టరీగా మారింది. ఆ కుటుంబ యజమాని ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఆయన భార్య గతంలో పారిస్‌లో డెంటిస్ట్‌గా పని చేసింది. ఆమె కవల సోదరి కంటి వైద్యురాలు. అయితే కుమారుడ్ని ఇటీవల స్కూల్‌ మాన్పించి ఇంటి వద్దే చదివిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ బాలుడి తండ్రిని సంప్రదించేందుకు స్కూల్‌ యాజమాన్యం ప్రయత్నించింది.

కాగా, ఆ వ్యక్తి స్పందించకపోవడంతో పోలీసుల ద్వారా కారణం తెలుసుకునేందుకు స్కూల్‌ యత్నించింది. ఇందులో భాగంగానే తమ పోలీస్‌లు వారి అపార్ట్‌మెంట్‌కు వెళ్లారని పోలీస్‌ అధికారి తెలిపారు. రోటీన్‌గా జరిగే ప్రక్రియ అని, ఇదేమీ నేరం కాదన్నారు. డోర్‌ తీయకపోవడంతో తమ పోలీసులు తిరిగి వచ్చారని చెప్పారు. అయితే ఫ్రెంచ్‌ కుటుంబం అనుమానాస్పదంగా అపార్ట్‌మెంట్ పైనుంచి కిందకు దూకడాన్ని చూసిన స్థానికులు తమకు సమాచారం ఇచ్చారని పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Post a Comment

 
Top