మళ్లీ ఐటీ సందడి.. ఏప్రిల్‌ 1 నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోంకు ముగింపు

  • రెండేండ్ల తర్వాత తిరిగి తెరుచుకోనున్న కార్యాలయాలు
  • హైబ్రిడ్‌ విధానంలో వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌కు పిలుపు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో సందడి పునఃప్రారంభం కానున్నది. సరిగ్గా రెండేండ్ల కిత్రం లాక్‌డౌన్‌తో ప్రాభవాన్ని కోల్పోయిన ఐటీ కారిడార్‌.. వచ్చే నెల 1 నుంచి మళ్లీ ఉద్యోగులతో కళకళలాడనున్నది. కొవిడ్‌ వల్ల ఇప్పటివరకు ఇండ్లకే పరిమితమైన ఐటీ ఉద్యోగులు.. ఇకనుంచి కంపెనీల ఆదేశాల మేరకు ఆఫీసులకు వచ్చి పనిచేయనున్నారు. ఈ మేరకు ఆయా ఐటీ కంపెనీలు ‘రిటర్న్‌ టు ఆఫీస్‌’ విధానం అమలుపై ఇప్పటికే తమ ఉద్యోగులకు సమాచారం ఇచ్చాయి. వాస్తవానికి ఐటీ కారిడార్‌లో ఇప్పటికే దాదాపు 20% కంపెనీలు తమ కార్యాలయాలను పునఃప్రారంభించాయి. మిగిలిన 80% కంపెనీలు సైతం ఏప్రిల్‌ నుంచి తమ కార్యాలయాలను పూర్తిస్థాయిలో తెరిచి, హైబ్రిడ్‌ వర్క్‌ విధానాన్ని అమలు చేయనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ఐటీ కంపెనీల్లో సుమారు 6.20 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

హైబ్రిడ్‌ వర్క్‌ విధానంపై ఆసక్తి

లాక్‌డౌన్‌ నాటి నుంచి ఐటీ ఉద్యోగులు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ విధానానికి అలవాటు పడ్డారు. ఇది కొందరికి అనుకూలంగా, మరి కొందరికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరికీ అనుకూలంగా ఉండేలా ఐటీ కంపెనీలు ‘హైబ్రిడ్‌ వర్క్‌’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. తద్వారా వారంలో సగం రోజులు ఆఫీస్‌ నుంచి, మిగతా సగం రోజులు ఇంటి నుంచి లేదా రిమోట్‌గా పనిచేసుకొనేందుకు వెలుసుబాటు కల్పించాయి. దీంతో హైబ్రిడ్‌ విధానంపై చాలా మంది ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. కుదిరితే ఆఫీసు నుంచి, కుదరకపోతే ఇంటి నుంచి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నారు.

మెట్రో రైళ్లలో పెరగనున్న రద్దీ

ఏప్రిల్‌ నుంచి ఐటీ ఉద్యోగుల రాకతో మెట్రో రైళ్లలో మళ్లీ రద్దీ పెరగనున్నది. హైదరాబాద్‌ నలుమూలల నుంచి, ప్రత్యేకించి నాగోల్‌, ఎల్‌బీనగర్‌, సికింద్రాబాద్‌, మియాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు మెట్రో రైళ్ల అనుసంధానత పెరగడంతో చాలా మంది ఉద్యోగులు మెట్రో రైళ్లను ఉపయోగించుకొంటున్నారు. కరోనాకు ముందు మెట్రో రైళ్లలో రోజూ దాదాపు 4.20 లక్షలు మంది ప్రయాణిస్తే.. అందులో ఐటీ ఉద్యోగులే 1.20 లక్షల మంది వరకు ఉండేవారు. మరోవైపు హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు గత రెండేండ్లలో లక్ష మందికిపైగా కొత్త ఉద్యోగులను చేర్చుకొన్నాయి. వీరిలో చాలా మంది మెట్రో రైళ్లతోపాటు ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను ఆశ్రయించే అవకాశం ఉన్నది.

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రద్దీ అధికంగా ఉండే మాదాపూర్‌ హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్స్‌చౌరస్తా, రహేజా మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌, ఇనార్బిట్‌మాల్‌, బయోడైవర్సిటీ జంక్షన్‌, గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌, విప్రో జంక్షన్‌, నానక్‌రాంగూడ, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ఐటీ కారిడార్‌లోనే అత్యధిక లింకు రోడ్లు

కరోనా సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో పదుల సంఖ్యలో లింకు రోడ్లను నిర్మించి, సూచికల బోర్డులను ఏర్పాటు చేసింది. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ భారం తగ్గనున్నది. మెహిదీపట్నం, గచ్చిబౌలి, రాయిదుర్గం వెళ్లే మార్గంలో కొత్తగా ఫ్లై ఓవర్‌ను నిర్మించడంతో ఐటీ కారిడార్‌కు వెళ్లేవారికి ఎంతో ఉపశమనం లభిస్తుంది.

కొత్త అనుభూతి కలుగుతుంది

కరోనా వల్ల ఇప్పటివరకు ఇంటి నుంచే పని చేశాం. రెండేండ్ల తర్వాత ఆఫీసుకు వచ్చి పనిచేయడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఐటీ ఉద్యోగుల్లో సీనియర్లు హైబ్రిడ్‌ విధానంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారంలో 3 రోజులు ఆఫీసు, మిగతా రోజుల్లో ఇంటి నుంచి పనిచేసేందుకు కంపెనీలు అంగీకరించాయి.
– బీ విజేందర్‌రెడ్డి, ఐటీ ఉద్యోగి

జూన్‌ నాటికి పూర్తిస్థాయిలో

ఇప్పటి వరకు 10% ఐటీ కంపెనీలు మాత్రమే ఆఫీసులను తెరిచాయి. ఏప్రిల్‌ నుంచి మిగిలిన కంపెనీల కార్యాలయాలు కూడా తెరుచుకోనున్నాయి. ఉద్యోగులంతా జూన్‌ నాటికి పూర్తిస్థాయిలో ఆఫీసులకు వచ్చే అవకాశం ఉన్నది.
– భరణి కుమార్‌ అరోల్‌, హైసియా అధ్యక్షుడు

Post a Comment

 
Top