మిస్సింగ్‌ బాలుడు… ట్రావెల్‌ బ్యాగ్‌లో శవంగా కనిపించాడు

న్యూఢిల్లీ: మిస్సింగ్‌ అయిన బాలుడు, ఒక ట్రావెల్‌ బ్యాగ్‌లో శవంగా కనిపించాడు. కిడ్నాపర్లు అతడి గొంతు కోసి హత్య చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ ఘటన జరిగింది. రోహిణీ ప్రాంతానికి చెందిన 17 ఏండ్ల బాలుడు గురువారం రాత్రి అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, వై బ్లాక్‌ మంగోల్‌పురి ఎదురుగా ఉన్న పీర్ బాబా మజార్ సమీపంలోని రోడ్డు పక్కన ఒక ట్రావెల్‌ బ్యాగులో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ట్రావెల్‌ బ్యాగును పరిశీలించారు. అందులో ఒక బాలుడి మృతదేహం కుక్కి ఉన్నది. గొంతు కోసి ఉండటంతోపాటు శరీరంపై పలు చోట్ల గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు.

మృతుడి వివరాలు తెలియకపోవడంలో సమీప పోలీస్‌ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్‌ ఫిర్యాదులపై పోలీసులు ఆరా తీశారు. దీంతో రోహిణీ సెక్టార్‌ 1లో గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన 17 ఏండ్ల బాలుడి మృతదేహంగా గుర్తించారు. బాలుడి కుటుంబం ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దక్షిణ రోహిణి పోలీస్‌ స్టేషన్‌ అధికారి తెలిపారు.

Post a Comment

 
Top