
బీజింగ్: పలు దశల్లో విరుచుకుపడి యావత్తు ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా వైరస్.. క్రమంగా కనుమరుగవుతోంది. కానీ, చైనా పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. లక్షలాది వైరస్ కేసులతో ప్రపంచ దేశాలు కొట్టుమిట్టాడుతున్న సమయంలో అక్కడ మాత్రం పెద్దగా అలజడి కనిపించలేదు. కానీ, ఇప్పుడు భారీ ఎత్తున కేసులు నమోదవుతుండడం గమనార్హం. అక్కడ రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారంతో పోలిస్తే నేడు కేసులు రెండింతలు కావడం కలవరపెడుతోంది. మహమ్మారి పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఆదివారం కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు చైనా అధికారులు ప్రకటించారు. రోజువారీ కేసుల్లో ఇది రెండేళ్ల గరిష్ఠం కావడం గమనార్హం. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కీలక నగరం షాంఘైలో పాఠశాలలను మూసివేసింది. మరికొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించింది. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నట్లు సమాచారం. జిలిన్ నగరంలో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. ఉత్తర కొరియా సరిహద్దు నగరమైన యాంజిని పూర్తిగా దిగ్బంధంలో ఉంచారు. ఏడు లక్షల జనాభా ఉన్న ఈ నగరంలో ఇప్పటికే ఆరు రౌండ్ల నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఓ స్థానిక అధికారి తెలిపారు. మరోవైపు మధ్యలో మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆరోగ్య వ్యవస్థలు కాస్త నిర్లక్ష్యంగా మారినట్లు అంగీకరించారు.
2019 డిసెంబరులో తొలిసారి కరోనా వైరస్ చైనాలోనే వెలుగుచూసింది. దీంతో అక్కడి ప్రభుత్వం మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. ఆంక్షలు, లాక్‌డౌన్లతో యావత్తు దేశాన్ని కొన్ని వారాల పాటు మూసివేసింది. ‘కొవిడ్-జీరో’ లక్ష్యంగా పెట్టుకొని కఠిన ఆంక్షలు అమలు చేశారు. ప్రయాణాలను పూర్తిగా నిషేధించారు. పెద్ద ఎత్తున నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
Post a Comment