
దిల్లీ: పాక్ భూభాగంలోకి భారత క్షిపణి దూసుకెళ్లడంపై భారత ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదని పాకిస్థాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత పార్లమెంటులో చేసిన ప్రకటన అసంపూర్తిగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో క్షిపణి ప్రమాద ఘటనపై సంయుక్త దర్యాప్తు జరిపించాలని భారత ప్రభుత్వాన్ని పాకిస్థాన్ డిమాండ్ చేసింది.
‘క్షిపణి ప్రమాదంపై రక్షణశాఖ మంత్రి భారత పార్లమెంటులో చేసిన ప్రకటన అసంపూర్తిగా, అసమగ్రంగా ఉంది. పాకిస్థాన్‌ను సంతృప్తిపరచడానికి ఇది సరిపోదు. ఆ ప్రకటనను తిరస్కరిస్తున్నాం. ఈ ఘటనపై సంయుక్త దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాం’ అని పాకిస్థాన్ విదేశాంగశాఖ మంత్రి షా మహమ్మూద్ ఖురేషీ వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనలు అత్యంత బాధ్యతారహితమైనవని చెప్పిన ఆయన.. అందుకు భారత ప్రతిస్పందన కూడా అదేవిధంగా ఉందని విమర్శించారు. ఖురేషీ వ్యాఖ్యలకు మద్దతు పలికిన పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ మొయీద్ యుసఫ్.. సంయుక్త దర్యాప్తునకు డిమాండ్ చేశారు.
పాకిస్థాన్ భూభాగంలోకి భారత క్షిపణి ప్రమాదవశాత్తు దూసుకెళ్లినప్పటికీ దానిని తీవ్రంగానే పరిగణిస్తున్నామని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు పార్లమెంటులో వెల్లడించారు. ఇప్పటికే దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తును చేపట్టినట్లు పేర్కొన్న ఆయన.. భారత క్షిపణి వ్యవస్థలు అత్యంత విశ్వసనీయమైనవి, సురక్షితమైనవని స్పష్టం చేశారు. అయితే, క్షిపణి ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న పాకిస్థాన్.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, పూర్తి వివరాలు తమకు తెలియజేయాలని తొలుత కోరింది. ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకున్న చర్యలు, విధానాలను వివరించాలని కోరుతోన్న పాకిస్థాన్.. తాజాగా దీనిపై సంయుక్తంగా దర్యాప్తు జరపాలని పట్టుబడుతోంది.
Post a Comment