త్వ‌ర‌లోనే మ‌రో 91 బ‌స్తీ ద‌వాఖానాలు ప్రారంభం : మంత్రి హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ : జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌జ‌ల ఆరోగ్య అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేశామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 259 బ‌స్తీ ద‌వాఖానాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. మ‌రో 91 బ‌స్తీ ద‌వాఖానాల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల్లో సంద‌ర్భంగా బ‌స్తీ ద‌వాఖానాల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి హ‌రీశ్‌రావు స‌మాధానం ఇచ్చారు.

బ‌స్తీ ద‌వాఖానాల్లో ఓపీడీ, టెలీ క‌న్స‌ల్టేష‌న్, బేసిక్ ల్యాబ్ డ‌యాగ్నోసిస్, ఉచిత మందులు, ఇమ్యునైజేష‌న్ స‌ర్వీసులు, ప్ర‌స‌వ పూర్వ‌క సంర‌క్ష‌ణ‌, ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సెలింగ్, ర‌క్త‌హీన‌త ప‌రీక్ష‌లు, బీపీ, బ్ల‌డ్ షుగ‌ర్‌తో పాటు అనేక స‌దుపాయాలు అందుతున్నాయ‌న్నారు. రాష్ట్రంలోని ఇత‌ర పెద్ద న‌గ‌రాల్లో కూడా ఇలాంటి ద‌వాఖానాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.

ప‌ట్ట‌ణాల్లో ఉండే పేద‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌ల‌ను అందించేందుకు సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో బ‌స్తీ ద‌వాఖానాల‌ను ప్రారంభించారని హ‌రీశ్‌రావు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా అభినందించింది. ఇది మ‌నంద‌రికి కూడా గ‌ర్వ‌కార‌ణం. ఈ ద‌వాఖానాలు పేద ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌కు వెళ్లి చాలా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టుకునేవారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో 259 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేసుకున్నాం. అతి త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ చుట్టూ ఉండే మున్సిపాలిటీల్లో కూడా బ‌స్తీ ద‌వాఖానాల‌ను ప్రారంభిస్తామ‌న్నారు.

బ‌స్తీ ద‌వాఖానాల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 81 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించామ‌న్నారు. టెలీ కాన్ఫ‌రెన్స్ ద్వారా సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌లందిస్తున్నామ‌ని తెలిపారు. ఈ ద‌వాఖానాల్లో నెల‌కు రూ. 75 వేలు ఖ‌ర్చు చేస్తున్నాం. ఒక డాక్ట‌ర్, స్టాఫ్ న‌ర్సు, హెల్ప‌ర్ ప‌ని చేస్తున్నారు. ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ద‌వాఖానాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నాయి. నాణ్య‌తతో కూడిన మందుల‌ను ఉచితంగా అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు. బ‌స్తీ ద‌వాఖానాలకు వ‌స్తున్న రోగుల‌ నుంచి సేక‌రించిన ర‌క్త న‌మూనాల ప‌రీక్ష‌ల‌ను టీ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌లో చేస్తున్నామ‌ని తెలిపారు. నిజామాబాద్ ప‌ట్ట‌ణానికి కూడా బ‌స్తీ ద‌వాఖానాల‌ను మంజూరు చేస్తామ‌న్నారు. వ‌రంగ‌ల్ లో కూడా బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Post a Comment

 
Top