
సైదాబాద్, న్యూస్‌టుడే: ఇరువురు వైద్య వృత్తిలో ఉన్నారు. ఇరువురిదీ రెండో వివాహమే. వరకట్న వేధింపులు తట్టుకోలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈనెల 8న మలక్‌పేట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. భర్తను ఈనెల 14న అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నల్గొండ జిల్లా దామరచర్లవాసి గంగనపల్లి కాశీ విశ్వనాథం కుమార్తె, వైద్యురాలైన కుమార్తె స్వప్న (38) తొలి వివాహం మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో చేశారు. ఖమ్మం జిల్లా పీహెచ్‌సీలో పనిచేస్తున్న క్రమంలో అనివార్య కారణాలతో విడాకులు తీసుకుంది. కర్నూలుకు చెందిన డాక్టర్ ఎం.శ్రీధర్‌తో 2015 ఏప్రిల్‌లో రెండో వివాహం జరిగింది. రూ.10లక్షల నగదు, 14 తులాల బంగారం కట్నం కింద అందజేశారు. అనంతరం ఆమెకు నగరంలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎండీ(ఎస్‌పీఎం) సీటు వచ్చింది. సైదాబాద్ డివిజన్ వెంకటాద్రినగర్‌లో వీరు ఉంటున్నారు. ఏడాది అనంతరం అదనపు కట్నం కోసం భర్త వేధించడం ప్రారంభించాడు. మానసిక వేదనకు గురైన ఆమె ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా మానసిక వైద్యుడికి చూపించారు. ఇంట్లో సగ భాగం, తల్లి బంగారు నగలు తీసుకురావాలని శ్రీధర్ పలుమార్లు ఒత్తిడి తెచ్చాడని ఆమె తండ్రి పోలీసులకు వివరించారు. ఈనెల 8న స్వప్న ఆత్మహత్య చేసుకుందని శ్రీధర్ సమాచారం ఇవ్వడంతో అనుమానం వచ్చి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. డాక్టర్ శ్రీధర్‌ను ఈనెల 14న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని మలక్‌పేట ఏసీపీ ఎన్.వెంకటరమణ పేర్కొన్నారు.
Post a Comment