టీఎన్‌ఎస్‌ఎఫ్, వైకాపా నాయకుల వాగ్వాదం

పాఠశాలలో వాగ్వాదానికి దిగి తోసుకుంటున్న
టీఎన్‌ఎస్‌ఎఫ్, వైకాపా నాయకులు
ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆదోని పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం పరిశీలన కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. టీఎన్‌ఎస్‌ఎఫ్, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, పాఠశాలలో మౌలిక వసతుల పరిశీలనకు టీఎన్‌ఎస్‌ఎఫ్ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు రామాంజనేయులు, కోటేశ్వరరావు, తేజ తదితరులు వెళ్లారు. వారు మధ్యాహ్న భోజనం పరిశీలిస్తుండగా.. ఈ విషయాన్ని తెలుసుకున్న వైకాపా ఆదోని పట్టణ అధ్యక్షుడు దేవ, చలపతి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు అక్కడికి చేరుకొని టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. మీరు పాఠశాలకు ఎందుకొచ్చారు. ఇక్కడికి కండువాలు, బ్యానర్లు తీసుకురాకూడదు, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు రామాంజనేయులు, కోటేశ్వరరావు మాట్లాడుతూ.. తాము పాఠశాలలో పరిశీలనకు వెళితే వైకాపా నాయకులు వచ్చి బయటకు వెళ్లాలంటూ దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.
Post a Comment