సిరికొండ, న్యూస్‌టుడే : ట్రాక్టర్‌ పేరుతో రూ.1.80 లక్షలు స్వాహా చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలో చోటుచేసుకుంది. బాధితుని వివరాల ప్రకారం.. మండలంలోని రిమ్మ గ్రామానికి చెందిన పెందూర్‌ నరేందర్‌ ఇచ్చోడలో ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 28న ఫేస్‌బుక్‌లో ట్రాక్టర్‌కు సంబంధించిన సమాచారం చూసి, ఈ ట్రాక్టర్‌ కావాలని కామెంట్‌ చేశాడు. పది నిమిషాల్లో మీతో ఫోన్‌లో మాట్లాడతానని తిరిగి కామెంట్‌ వచ్చింది. అనంతరం అవతలి వ్యక్తి నేను మధ్యప్రదేశ్‌లో పని చేసే ఆర్మీ అధికారినని.. తన పాన్‌కార్డు, ఆర్మీ డ్రెస్‌లో ఉన్న చిత్రాలను చూపించాడు. ట్రాక్టర్‌ అమ్ముతున్నానని నమ్మబలికాడు. రూ.2 లక్షల ట్రాక్టర్‌ను చివరిగా రూ.1.60 లక్షలుగా విక్రయించడానికి బేరం కుదిరింది. మొదట రూ.14 వేలు, రెండో రోజు రూ.39,099, మూడో రోజు రూ.లక్ష సంబంధిత వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేశాడు. తర్వాత అదనంగా మరో రూ.30 వేలూ పంపాడు. అయినా ట్రాక్టర్‌ మాత్రం పంపలేదు. ట్రాక్టర్‌ బీమా కోసం ఇంకో రూ.24 వేలు కావాలని అడిగాడు. నాకు నీ ట్రాక్టర్‌ అవసరం లేదని నా డబ్బులు నాకు కావాలని నరేందర్‌ అడిగాడు. ఇచ్చిన డబ్బులు తిరిగి కావాలంటే రూ.15 వేలు కట్టాలని సదరు వ్యక్తి డిమాండ్‌ చేశాడు. నిండా మునిగానని తెలుసుకున్న నరేందర్‌ తలబాదుకుంటున్నాడు. మేకలను అమ్మి రూ.50 వేలు, అప్పు చేసి మరో రూ.లక్ష అతడికి ఇచ్చి మోసపోయినట్లు పేర్కొంటున్నాడు. ఈ విషయమై పోలీసు స్టేషన్‌లో ఇంకా ఫిర్యాదు అందలేదు.

Post a Comment

 
Top