
- కరోనా సమయంలో సేవ చేసినవారికి అవకాశం
- 8 ఏండ్లలో ప్రజావైద్యానికి ప్రాణం పోశాం
- వైద్య రంగంలో కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు
- జిల్లాకో మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి హరీశ్‌రావు
- కరోనా సమయంలో సేవలందించినవారికి అవకాశం
- తాత్కాలిక పద్ధతిలో పనిచేసిన వారి సేవలకు గుర్తింపు
- ఎనిమిదేండ్లలో ప్రజావైద్యానికి ప్రాణం పోశాం
- వైద్యారోగ్య రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు
- జిల్లాకో మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలోనే మొదటిసారి
- వైద్యశాఖ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి తన్నీరు హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో తాత్కాలిక పద్ధతిలో సేవలందించిన వైద్య సిబ్బందికి ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ ఇస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం కొందరు సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో సంవత్సరం ఒప్పందం మేరకు నియమించుకున్నదని, వారి అద్భుత సేవలను ప్రభుత్వం గుర్తించిందని, నియామకాల్లో వారికి వెయిటేజీ ఇస్తామని చెప్పారు. శనివారం అసెంబ్లీలో ఆరోగ్యశాఖ పద్దుపై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. టిమ్స్ దవాఖానపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కొవిడ్ సేవల కోసం ప్రభుత్వం టిమ్స్‌ను తాత్కాలిక దవాఖానగా మార్చిందని, ఇప్పుడు అక్కడ పూర్తిస్థాయి వసతులతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నామని తెలిపారు. పేదల ప్రాణాలు నిలిపే ప్రభుత్వ దవాఖానలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం బలోపేతం చేసి ప్రాణం పోసిందని పేర్కొన్నారు. ఏడేండ్లలోనే గుణాత్మక మార్పు సాధ్యమైందని వెల్లడించారు. దేశంలోనే తొలిసారి ములుగు, సిరిసిల్లలో హెల్త్ ప్రొఫైల్‌కు శ్రీకారం చుట్టామని, రెండు నెలల్లో అది పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్రను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తామని వివరించారు. ఇది తెలంగాణ ఆరోగ్య రంగం ముఖచిత్రాన్ని మార్చేసి, ఆరోగ్య తెలంగాణను సాకారం చేస్తుందని పేర్కొన్నారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ
జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఏడేండ్లలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యను 17కు పెంచామని, ఈ ఏడాది 8, వచ్చే ఏడాది మరో 8 ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ, ఒక వైరాలజీ కేంద్రం, ఒక పాలియేటివ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ నలువైపులా నాలుగు టిమ్స్‌లు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. వరంగల్‌లో రూ.1,100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిమ్స్ దవాఖానలో అదనంగా 2వేల పడకలు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు .గుండె చికిత్సకు అవసరమైన అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌లు వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మంలో చేశామని, మరిన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై చేస్తున్న తలసరి ఖర్చు రూ.1,698గా ఉన్నదని, ఇది దేశంలో మూడో స్థానమని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. 2022-23 బడ్జెట్‌లో కేటాయించిన నిధుల ద్వారా తలసరి ఖర్చు రూ.3,092కి చేరుతుందని, దీంతో మూడో స్థానంలో నుంచి మొదటిస్థానానికి వస్తామని చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో వైద్యానికి రూ.11,440 కోట్లు ప్రతిపాదించామని వెల్లడించారు.
ఇతర అంశాలు
- రూ.32.50 కోట్లతో 61 మార్చురీల ఆధునీకరణ.
- కంటి వెలుగు పథకం కింద ఐదు నెలల్లో కోటిన్నర మందికి పరీక్షలు, 41 లక్షల కండ్లద్దాల పంపిణీ.
బ్లాక్, వైట్‌ఫంగస్ చికిత్సకు కార్పొరేట్ దవాఖానలు చేతులెత్తేస్తే కోఠి ఈఎన్టీ దవాఖాన రూ.లక్షల వైద్యాన్ని ఉచితంగా చేసింది. - నారాయణపేటలో నర్సింగ్ కాలేజీ మంజూరు.
- హైదరాబాద్ పాతబస్తీలో డయాలసిస్, టీడీ సేవల విస్తరణ. నిజామియా టీబీ కాలేజీ అభివృద్ధికి నిధులు.
- హైకోర్టు తీర్పు అనంతరం ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధం.
- 10-15 రోజుల్లో సంగారెడ్డి మెడికల్ కాలేజీ పనులు పూర్తి.
- కేసీఆర్ కిట్‌తో బహుళ ప్రయోజనాలు
కేసీఆర్ కిట్ల ద్వారా ఇప్పటివరకు 13.29 లక్షల మంది లబ్ధి పొందారని, 300 అమ్మఒడి వాహనాల ద్వారా 38 లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు. ఎస్‌ఎన్‌సీయూ కేంద్రాలను 18 నుంచి 65కు, పీడియాట్రిక్ ఐసీయూలను 2 నుంచి 35కు పెంచామని వివరించారు. 22 మాతాశిశు సంరక్షణ కేంద్రాల(ఎంసీహెచ్)ను రూ.407 కోట్లతో ఏర్పాటుచేశామని, రూ.28 కోట్లతో 350 ప్రసూతి కేంద్రాలను ఆధునీకరించామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్ ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, వీటి సంఖ్యను 45 నుంచి 102కు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 256 బస్తీ దవాఖానలు ప్రజల సుస్తీ పోగొడుతున్నాయని చెప్పారు. వైద్యసేవలతో పాటు టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి, మందులు పంపిణీచేస్తున్నామని తెలిపారు. బస్తీ దవాఖానల స్ఫూర్తితో పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని కేంద్రంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషన్ మెడిసిన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పి, గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించి కేంద్రం వక్ర బుద్ధిని చాటుకొన్నదని మండిపడ్డారు.
డాక్టర్ పోస్టులన్నీ భర్తీ చేశాం
జిల్లా ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా దవాఖానల్లో డాక్టర్ పోస్టులన్నీ భర్తీ చేశామని, సరైన వివరాలతో మాట్లాడాలని భట్టికి సూచించారు. కరోనా సమయంలో అన్ని జిల్లాల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులో ఉంటే కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కలెక్టర్లు భర్తీ చేశారని, ఇవి కాంట్రాక్ట్ పద్ధతి నియామకాలు కాబట్టి.. టెక్నికల్‌గా ఖాళీలు కనిపిస్తాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అన్ని డాక్టర్ పోస్టులను భర్తీ చేసినట్టు తెలిపారు.


Post a Comment