నారాయణ్‌పూర్‌లో ఐఈడీ పేల్చిన మావోయిస్టులు.. ITBP ఏఎస్‌ఐ మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. నారాయణ్‌పూర్‌లోని సోన్‌పూర్ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో ఇండో టిబెటన్‌ బార్డర్ పోలీస్‌ (ITBP) 53వ బెటాలియన్‌కు చెందిన ఏఎస్‌ఐ రాజేంద్ర సింగ్‌ అక్కడికక్కడే అమరణించారు. ఈ పేలుళ్లలో హెడ్‌ కానిస్టేబుల్‌ మహేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడని నారాయణ్‌పూర్‌ ఎస్పీ సదానంద్‌ కుమార్‌ చెప్పారు. గాయపడిన జవాన్‌ను మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌ తరలిస్తున్నామన్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టామని వెల్లడించారు.

సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్‌, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కేర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిచోర్‌గూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు పనుల వద్ద డీఆర్‌జీ బృందం పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో ఉదయం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ తెలిపారు.

Post a Comment

 
Top