కర్ణాటక: కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్‌ వస్త్రధారణ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్‌ ధరించడం మతపరంగా  తప్పనిసరి కాదని పేర్కొంది. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. ఈ మేరకు ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది. 

విద్యా సంస్థల్లో హిజాబ్‌ వస్త్రధారణపై గత నెల కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో హిజాబ్‌కు మద్దతుగా- వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. మరోవైపు హిజాబ్‌ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. తొలుత జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌తో ఏర్పాటైన ఏకసభ్య ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. దీనిపై ఫిబ్రవరి 10న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించి.. పదిహేను రోజుల పాటు వాదనలు వినింది. ఇదే సమయంలో సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ఉన్నత న్యాయస్థానం.. నేడు తుది తీర్పు వెలువరించింది. 

హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే నేడు బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు. నేటి నుంచి మార్చి 19 వరకు ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఉడుపిలో నేడు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

Post a Comment

 
Top