
- ఆర్థిక మూలాలపై దెబ్బపడకుండా నిర్వాహకుల జాగ్రత్తలు
- ఒకే ఖాతా కాకుండా..పదుల సంఖ్యలో అకౌంట్లలోకి డిపాజిట్లు
- చైనా నుంచి ఆదేశాలతో మళ్లీ తెరుచుకుంటున్న కాల్‌సెంటర్లు
సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రుణ యాప్ దందా మళ్లీ బుసలుకొడుతున్నది. చాపకిందనీరులా విస్తరిస్తున్నది. అయితే ఈసారి నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. రుణగ్రస్తులు చెల్లించే డబ్బులు ఒకే అకౌంట్‌లోకి కాకుండా వేర్వేరు ఖాతాల్లోకి డిపాజిట్ చేయిస్తున్నారు. ఇలా చేస్తే… పోలీసులు ఒక ఖాతాను ఫ్రీజ్ చేస్తే..కొంత మొత్తం మాత్రమే బ్లాక్ అవుతుంది. మిగతా వాటిల్లోని డబ్బు సురక్షితంగా ఉంటుందని యాప్ నిర్వాహకులు ఈ ఎత్తుగడ వేస్తున్నారు.
దరఖాస్తుల పరిశీలన లేకుండా చిటికెలో రుణాలిస్తామంటూ.. ముందుకొచ్చిన వందల సంఖ్యలో రుణ యాప్‌లు తక్కువ మొత్తాల్లో లోన్లు ఇచ్చి.. ఎక్కువ మొత్తంలో వడ్డీలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ఉదంతాలు గతంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించిన తరువాత కూడా రుణగ్రస్తులను వేధించడంతో 2020లో పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అప్పట్లో పలు రుణ యాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ..పలువురు నిందితులను అరెస్టు చేశారు. వందల సంఖ్యల్లో ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దీంతో రుణయాప్‌ల నిర్వాహకులకు ఊహించని షాక్ తగిలింది. అక్రమ పద్ధతిలో అప్లికేషన్లను నిర్వహించి అడ్డంగా దర్యాప్తు సంస్థలకు దొరికిపోయారు.
చైనా నుంచి..
అప్పట్లో రుణ యాప్‌లను చైనా నుంచి నిర్వహిస్తూ.. మన దేశంలోని అమాయకులను పీల్చిపిప్పి చేశారు. ఒక యాప్‌ను తయారు చేయడం.. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచి రుణాలు ఇస్తామంటూ ప్రచారం చేయడం.. కాల్ సెంటర్లు నిర్వహించి.. రుణగ్రస్తులను వేధింపులకు గురిచేయడం చేసేవారు. ఢిల్లీ, ముంబై, బెంగళూర్, హైదరాబాద్, పుణె, కోల్‌కత్తా ప్రాంతాల్లో రుణయాప్‌లకు సంబంధించిన కాల్‌సెంటర్లు నిర్వహించడంతో పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు.
మళ్లీ తెరపైకి..
సంవత్సరం పాటు విరామం ఇచ్చిన రుణయాప్ నిర్వాహకులు.. మళ్లీ దందా మొదలుపెట్టారు. వసూళ్ల కోసం వేధింపులు ప్రారంభించారు. అయితే ఈ సారి మాత్రం తమ ఆర్థిక మూలాలపై దెబ్బ పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే యాప్‌లను నిర్వహిస్తూ.. రుణం కావాల్సిన వారికి పేమెంట్ గేట్‌వే ద్వారా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నారు. తిరిగి రుణగ్రస్తులు చెల్లింపులు చేసే సమయంలో ఒక అకౌంట్ కాకుండా వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేయిస్తున్నారు. ఒకేసారి వందలాది అకౌంట్లను కమీషన్ విధానంలో రుణయాప్‌ల నిర్వాహకులు సేకరిస్తున్నారు. ఏ రోజుకారోజు ఆయా ఖాతాల్లోంచి నగదును తమ అకౌంట్లలోకి బదిలీ చేసుకుంటున్నారు.
మళ్లీ చైనీయుల ఎంట్రీ
గతంలో రుణయాప్ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించిన కొందరు చైనీయులు వివిధ కారణాలతో దేశం విడిచి వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు కొందరు తమ పాత వ్యాపారాలకు పదును పెడుతున్నారు. ఇక్కడున్న వారితో కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. చైనాకు చెందిన చెన్ చవోపింగ్ ఇచ్చిన ఆదేశాలతో బెంగళూర్‌లో కాల్‌సెంటర్ నిర్వహించిన ఒడిశాకు చెందిన షబ్బీర్ ఆలమ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఉమాకాంత్ యాదవ్‌లను ఇటీవల సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
Post a Comment