కార్లు కొనేందుకు రుణం.. ఆపై మోసం

 కార్ల కోసం రుణాలు తీసుకొని.. పథకం ప్రకారం తమను తల్వార్‌ మోటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు మోసం చేసి.. రూ. 2 కోట్ల వరకు నష్టం చేశారంటూ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీనియర్‌ రీజినల్‌ మేనేజర్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్వార్‌ కార్స్‌ డైరెక్టర్లపై కేసు నమోదైంది. 2017లో తల్వార్‌ కార్స్‌ సంస్థ నిర్వాహకుడు సాకేత్‌ తల్వార్‌ తమ డైరెక్టర్లకు నాలుగు ఓల్వోఎక్స్‌సీ 90 కార్లు కావాలని, ఒక్కో దానికి రూ. 75 లక్షల రుణం కావాలని, కారు కొటేషన్‌ ధర రూ. 95 లక్షలు సూచిస్తూ..చార్మినార్‌ బ్రాంచ్‌కు దరఖాస్తు చేశారు. ఈ లోన్లకు సునీల్‌ తల్వార్‌, సాకేత్‌ తల్వార్‌, సరల్‌ తల్వార్‌, అర్పితా తల్వార్‌, రాధిక తల్వార్‌, అరుణ తల్వార్‌లు వ్యక్తిగత పూచీ ఇస్తున్నట్లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు అన్నింటినీ అందజేశారు. బ్యాంకు నాలుగు కార్లకు రూ. 3 కోట్లు మంజూరు చేసింది. అయితే ఇందులో ముందుగా చెప్పినట్లు ఒకే మోడల్‌ కాకుండా వేర్వేరు మోడల్స్‌కు సంబంధించిన కార్లను విక్రయించినట్లు ఇన్వాయిస్‌లో బ్యాంకుకు అందజేశారు. ఈ తేడాలను గుర్తించిన బ్యాంకు అధికారులు.. అప్పుడే అనుమానాలు వ్యక్తం చేశారు. అమ్మేవాళ్లు, కొనేవాళ్లు ఒక్కరే కావడంతో కార్ల పేరుతో రుణాలు తీసుకొని నిధులను ఇతర వ్యాపారాలకు మళ్లించారని గుర్తించారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలని ఒత్తిడి తేగా, ఒక కారు రుణాన్ని 2019 జూన్‌లో చెల్లించారు. మిగతా మూడు కార్ల రుణాలు చెల్లించకపోవడంతో అవి ఎన్‌పీఏ(నాన్‌ పర్‌ఫామింగ్‌ అసెట్స్‌) జాబితాలోకి చేరాయి. బ్యాంకుకు ఎక్స్‌ షోరూం ధర రూ. 3,24,60,000గా అందజేశారు. అలాగే కార్లు కొన్న తర్వాత వాటి ఇన్వాయిస్‌ ధరలు రూ. 2,23,02,215 ధరగా సూచిస్తూ.. డాక్యుమెంట్లు అందజేశారు. ఇక్కడే రూ. 1,01,57,785 వ్యత్యాసం ఉందని అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలను బ్యాంకుకు అందించి, తీసుకున్న రుణానికి సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి.. మోసం చేశారంటూ వారు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

 
Top