సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, దయాకర్‌రావు, మల్లారెడ్డి

హైదరాబాద్‌, మార్చి 12: అభయహస్తం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం కింద స్వయం సహాయక సంఘాల మహిళలు గతంలో పొదుపు చేసిన మొత్తాన్ని రెండు, మూడ్రోజుల్లోనే వారి ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 21 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు దాదాపు రూ.545 కోట్లు పొదుపు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రస్తుతం పేదరిక నిర్మూలన సంస్థ వద్ద ఉన్న ఈ నిధులు మహిళల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నిధులపై శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించిన మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి ఆయా శాఖల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

 

ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభయహస్తం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకంలో భాగంగా వృద్ధాప్యంలో నెలకు రూ.500 చొప్పున పింఛన్‌ పొందేందుకు మహిళలు ఏడాదికి రూ.365 చొప్పున పొదుపు చేశారు. ఈ పథకం ద్వారా లభించే పెన్షన్‌ కంటే తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.2,016 చొప్పున ఇస్తున్న ఆసరా పెన్షన్‌ ఎక్కువగా ఉన్నందున మహిళలు ఈ పథకం నుంచి బయటకు రావాలని కోరుకొంటున్నారని మంత్రులు వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళల విజ్ఞప్తి మేరకు అభయహస్తం సొమ్ములు తిరిగి వాపస్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా పాల్గొన్నారు.

Post a Comment

 
Top