సవరించిన తేదీలను ప్రకటించిన బోర్డులు

హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి.. పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి ప్రారంభం కానున్నాయి. జేఈఈ మెయిన్ తొలి విడత తేదీల్లో మార్పు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో వార్షిక పరీక్షల తేదీలను సవరిస్తూ ఇంటర్, ఎస్‌ఎస్‌సీ బోర్డుల అధికారులు బుధవారం కొత్త కాలపట్టికలను విడుదల చేశారు. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు మే 4వ తేదీతో ముగుస్తాయి. ఈ క్రమంలో 6వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మొదలుకానున్నాయి. సైన్స్ విద్యార్థులకు మే 19న పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత మే 24న ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్ రెండో విడతకు నాలుగు రోజుల వ్యవధి ఉంటుంది. ఇంటర్ అన్నీ పరీక్షలు మే 24న ముగుస్తాయి. మే 23న ప్రారంభమయ్యే పదో తరగతి ప్రధాన పరీక్షలు వరుసగా 6 రోజులు జరగనున్నాయి.
ప్రయోగ పరీక్షలు యథాతథం
గతంలో ప్రకటించినట్లుగానే ఎంపీసీ, బైపీసీ, జియాలజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులతోపాటు ఒకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఆదివారాల్లోనూ ఇవి ఉంటాయని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ 11న నైతికత, మానవీయ విలువలు, 12న పర్యావరణ విద్య పరీక్షలూ గతంలో ప్రకటించినట్లుగానే జరుగుతాయని ఆయన తెలిపారు.
* ఇంటర్ పరీక్షల సమయం: ఉదయం 9-12 గంటల వరకు
* పదో తరగతి పరీక్షల సమయం: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు
* హాజరయ్యే విద్యార్థుల సంఖ్య: దాదాపు 5.50 లక్షల మంది

Post a Comment