జేఈఈ మెయిన్ తేదీలను మార్చిన ఎన్‌టీఏ
ఆ ప్రకారం ఇంటర్మీడియట్ తేదీలు మార్చే అవకాశం ఉందన్న మంత్రి సబిత
పదో తరగతిపైనా ప్రభావం!

ఇంటర్ పరీక్షల కాలపట్టిక మరోసారి మారనుంది. జేఈఈ మెయిన్ తేదీలను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) సోమవారం మార్చింది. ఏప్రిల్ 16కు బదులు 21 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రెండోసారి మారనుంది. ఇంతకుముందు ప్రకటించిన జేఈఈ మెయిన్ తేదీలను దృష్టిలో పెట్టుకొని.. 12 రోజుల క్రితం ఇంటర్ పరీక్షల తేదీలను ఒకసారి మార్చిన సంగతి తెలిసిందే.
జేఈఈ మెయిన్ షెడ్యూల్ మార్పు దృష్ట్యా.. ఇంటర్ పరీక్షల తేదీలను సైతం మార్చాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధికారులతో చర్చించి త్వరలో పూర్తి స్పష్టత ఇస్తామని వెల్లడించారు. నీట్ తేదీని ఇంకా ప్రకటించలేదని, దాన్ని కూడా పరిశీలించి ఇంటర్ తేదీల మార్పులపై రెండు మూడు రోజుల్లో వెల్లడిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

జేఈఈ పరీక్షల రోజు పరీక్షలు లేకున్నా..: జేఈఈ మెయిన్ నూతన తేదీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు లేవు. పక్కపక్క తేదీల్లో ఉన్నాయి. ఒక రోజు జేఈఈ, మరో రోజు ఇంటర్ పరీక్షలు రాయడం కష్టమని, విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి.. ద్వితీయ ఏడాది పరీక్షలను తర్వాత త్వరగా జరపాలనుకున్నా రెండు పరీక్షల మధ్య ఒక రోజు వ్యవధి లేకుండా నిర్వహించడం విద్యార్థులకు సమస్య అవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ ఇంటర్ రెండు సంవత్సరాలకు మే 5 నుంచి పరీక్షలు ప్రారంభిస్తే.. పూర్తయ్యేసరికి మే 20వ తేదీ వస్తుంది. ఆ తర్వాత మూడు రోజులకే జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షలు (మే 24 నుంచి) ప్రారంభమవుతాయి.
దీనికి సిద్ధమవడానికి విద్యార్థులకు ఎక్కువ సమయం ఉండదు. వాస్తవానికి ఈసారి రెండు విడతల్లోనే జేఈఈ మెయిన్ జరుగుతున్నందున విద్యార్థులు చివరి విడతపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారని నిపుణులు చెబుతున్నారు.
జేఈఈ మెయిన్ పాత తేదీలు
ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21
జేఈఈ మెయిన్ కొత్త తేదీలు
ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4
ఎన్‌టీఏ ఇష్టారాజ్యం
జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ).. రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకోకుండానే జేఈఈ తేదీలను ఖరారు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. తేదీల్లో మార్పు చేసే ముందు తమను సంప్రదించలేదని తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ ‘ఈనాడు’కు తెలిపారు.
పదో తరగతిపైనా ప్రభావం
ఇంటర్ పరీక్షల తేదీలు మారితే పదో తరగతి పరీక్షల తేదీలనూ మార్చాల్సి ఉంటుంది. ఇంటర్ పరీక్షలు మే 11వ తేదీతో ముగియనుండగా.. ఆ తర్వాత రోజు నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతాయి.
ఇప్పుడు ఇంటర్ తేదీలు మారితే ‘పది’ తేదీలను కూడా మార్చక తప్పదు. పాఠశాల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఇంటర్ పరీక్షల విధుల్లో పనిచేస్తారు. దానికితోడు పోలీసుస్టేషన్లలో ప్రశ్నపత్రాలు ఉంచడం సమస్య అవుతుంది.
Post a Comment