కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు కౌన్సిలర్లు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. ఇందులో ఒకరిని దుండగుడు పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌ పెట్టి కాల్చివేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. ఆదివారం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రెండు హత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహతి మున్సిపాలిటీకి చెందిన టీఎంసీ కౌన్సిలర్‌ అనుపమ్‌ దత్తా ఆదివారం హత్యకు గురయ్యారు. నిన్న సాయంత్రం అగర్‌పరా ప్రాంతంలో అనుపమ్‌ దత్తా ఓ దుకాణం నుంచి బయటకు వచ్చి స్కూటీపై వెనుక కూర్చున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుండగుడు అనుపమ్ తలకు తుపాకీ పెట్టి కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనుపమ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ద్వారా నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు కాంట్రాక్ట్‌ కిల్లర్‌ అని సమాచారం. కాగా.. ఈ ఘటనకు కొద్ది గంటల ముందే పురులియా ప్రాంతంలో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ తపన్‌ కుందును గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తపన్‌ కుందు తన ఇంటికి సమీపంలో వాకింగ్‌ చేస్తుడగా.. బైక్‌పై వచ్చిన దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తపన్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఇద్దరి హత్యలకు సంబంధం ఉందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

 
Top