రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఒకపక్క యుద్ధం కొనసాగుతున్నా, ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండటం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పెంచే సమయం ఆసన్నం కావడంతో బంగారం నుంచి పెట్టుబడులను మదుపర్లు ఉపసంహరిస్తున్నారు. ముడిచమురు బ్యారెల్‌ ధర కూడా 100 డాలర్ల దిగువకు పరిమితమైనందున, ద్రవ్యోల్బణ భయాలు కూడా కాస్త తగ్గుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈనెల 8న గరిష్ఠంగా 2069 డాలర్లకు చేరిన ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర మంగళవారం ఒకదశలో 1915 డాలర్లకు దిగివచ్చింది. భారత కాలమానం ప్రకారం రాత్రి  11.30 గంటల సమయానికి 1926 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫలితంగా దేశీయంగా బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.53,000, కిలో వెండి రూ.69,600 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.. ఈనెల 8న ఈ ధరలు వరుసగా రూ.55,100, రూ.72,900గా ఉండటం గమనార్హం. అంటే వారం వ్యవధిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.2100, కిలో వెండి ధర రూ.3300 తగ్గింది

Post a Comment

 
Top