24 hours quality electricity in summer says Balineni Srinivasreddy - Sakshi

మాట్లాడుతున్న మంత్రి బాలినేని, చిత్రంలో మేయర్‌ భాగ్యలక్ష్మి, మల్లాది విష్ణు తదితరులు

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

అత్యధిక ధరలకు పీపీఏ ఎందుకు చేసుకున్నారో టీడీపీ చెప్పాలి

మధురానగర్‌ (విజయవాడ సెంట్రల్‌): వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా 24/7 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని రాష్ట్ర ఇంధన శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. విజయవాడ 30వ డివిజన్‌ దేవీనగర్‌ ట్రెండ్‌సెట్‌ మెడోస్‌లో రూ.3.60 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ..వేసవిలో ఎటువంటి పవర్‌కట్‌ లేకుండా నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా అందించాలని, అవసరమైతే అదనంగా విద్యుత్‌ కొనుగోలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని తెలిపారు.

టీడీపీ హయాంలోని రూ.26 వేల కోట్ల  బకాయిలను సైతం వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వమే చెల్లించిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో వసూలు చేసిన ట్రూఅప్‌ చార్జీలను సైతం తిరిగి చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. రూ.2.49కు లభించే విద్యుత్‌ రూ.4.84 చెల్లించడానికి  గత ప్రభుత్వ హయాంలో ఎందుకు పీపీఏ చేసుకున్నారో టీడీపీ నేతలు చెప్పాలని అన్నారు. 86 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని వివరించారు. తమ పథకాలే తమ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని, వచ్చే ఎన్నికల్లో 150కు పైగా సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు.

Post a Comment

 
Top