
Mariupol theatre sheltering children bombed: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ నానాటికీ మరింత వికృతంగా మారిపోతుంది. మూడు వారాలకు పైగా కొనసాగుతున్న నిరవధిక దాడిలో ఉక్రెయిన్‌ని నేలమట్టం చేసే దిశగా రష్యా ఘోరంగా దాడి చేస్తోంది. అందులో భాగంగా ఆసుపత్రులు, నిరాశ్రయులై మానవతా కారిడార్ సాయంతో ఆశ్రయం పొందుతన్న స్థావరాలను సైతం విడిచిపెట్టకుండా భయంకరమైన దాడులకు దిగుతోంది
అంతేకాదు చిన్నారుల ఆశ్రయం పొందుతున్న మారియుపోల్ థియేటర్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈ డ్రామా థియేటర్‌లో సుమారు వెయ్యి మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారని మారియుపోల్ స్థానిక కౌన్సిల్ పేర్కొంది. అభంశుభం తెలియని చిన్నారులని కనికరం లేకుండా అత్యంత క్రూరమైన దాడులకు దిగుతున్న రష్యాని తాము ఎప్పటికి క్షమించమని స్థానిక కౌన్సిల్ ఆవేదనగా వెల్లడించింది.
ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మారియుపోల్‌లోని థియేటర్‌పై రష్యా దళాలు శక్తివంతమైన బాంబులతో దాడి చేసినట్లు పేర్కొంది. అంతేకాదు ఆ భవనం శిథిలాల కింద దాదాపు వెయ్యి మంది వరకు చిక్కుకుని ఉండవచ్చునని తెలిపింది. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదంటూ ఉక్రెయిన్ ఆరోపణలను ఖండించింది. దీంతో మీడియా అవుట్‌లెట్ నెక్స్టా ట్విట్టర్‌లో రష్యా దళాలచే బాంబు దాడికి ముందు డ్రామా థియేటర్ లోపల దృశ్యాలను చూపుతున్న ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భవనంలో చాలా మంది పిల్లలు కూర్చుని ఉన్నారు.
మారియుపోల్‌లో ఇప్పటివరకు 2 వేల మందికి పైగా పౌరులు మరణించినట్లు వెల్లడించింది. అదీగాక నగరంలో 13 రోజులుగా విద్యుత్, గ్యాస్ లేదా తాగు నీరు లేవు దీనికి తోడు రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోతున్నాయని తెలిపింది. అంతేగాక రష్యా ఎందుకు మారియుపోల్‌నే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందంటే మారియుపోల్ అజోవ్ సముద్రంలోని అతి ముఖ్యమైన ఉక్రెనియన్ ఓడరేవు మాత్రమే గాక ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే గనుక రష్యా చాలా కాలంగా కలలు కంటున్న క్రిమియాకు ల్యాండ్ కారిడార్ లభిస్తుందని మీడియా అవుట్‌లెట్ నెక్స్టా ట్విట్టర్ పేర్కొంది.
Post a Comment