సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: అదనపు కట్నం వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత తన కుమారుడితో పాటు నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్మకు యత్నించిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఏడాది వయసున్న బాబు అక్కడికక్కడికే మృతి చెందగా, తీవ్ర గాయాలతో తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. మెట్టుగూడకు చెందిన తప్పెట మహేందర్‌, దివ్యతేజ(32) భార్య భర్తలు. 2018 సెప్టెంబరు 6న మల్కాజిగిరి సఫిల్‌గూడకు చెందిన లక్ష్మణ్‌దాస్‌, తరుణలతల కుమార్తె దివ్యతేజకు మెట్టుగూడకు చెందిన మహేందర్‌తో వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ.4లక్షల నగదు, 10తులాల బంగారు నగలు ఇచ్చారు. తాను సీఏ చదివానని, ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నానని చెప్పిన మహేందర్‌ పెళ్లి తర్వాత ఉద్యోగానికి వెళ్లడం మానేశాడు. గతేడాది మార్చిలో ఈ దంపతులకు బాబు(రుత్విక్‌) జన్మించాడు. మెట్టుగూడలో వీరు నివాసముంటున్నారు. ఉద్యోగానికి వెళ్లకపోగా, ఇల్లు గడవడానికి అదనపు కట్నం తేవాలంటూ మహేందర్‌ తన భార్యను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. మరో మహిళతో అతడిని వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే దివ్యతేజ ఈ నెల 7న తన నగలను తీసుకెళ్లి పుట్టింట్లో ఉంచి ఈనెల 13న తిరిగి వచ్చింది. వచ్చేసరికి వేరొకరితో భర్త గొడవ పడుతుండటం చూసి మానసికంగా కుంగిపోయింది. దీంతో సోమవారం ఉదయం ఎదురుగా ఉన్న నాలుగంతస్తుల భవనంపైకి తన కొడుకును తీసుకుని వెళ్లింది. అక్కడ తన కొడుకు మెడ కింద, రెండు చేతుల మణికట్టు వద్ద చాకుతో కోసింది. తానుకూడా కోసుకుంది. ఆ చిన్నారికి శానిటైజర్‌ తాగించి, తాను కూడా తాగింది. తరువాత పైనుంచి కొడుకు సహా కిందకు దూకింది. ఈ ఘటనలో చిన్నారి రుత్విక్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిలకలగూడ ఠాణా డీఐ నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టారు. నిందితుడు మహేందర్‌, అతని కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Post a Comment

 
Top