హైదరాబాద్‌ వరద బాధితులకు కేంద్రం మొండిచెయ్యి

6 రాష్ర్టాలకు 1,682 కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులు
ఎన్నిసార్లు అడిగినా తెలంగాణకు పైసా ఇవ్వని బీజేపీ సర్కారు

హైదరాబాద్‌, మార్చి 12 : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వివక్ష ప్రదర్శించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్‌ఎఫ్‌) ద్వారా రాష్ర్టాలకు అందించే ఆర్థిక సహాయం విషయంలో తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం తాజాగా విడుదలచేసిన జాబితాలో తెలంగాణ ఊసే లేదు. ఇటీవల వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరికి కలిపి తాజాగా కేంద్రం ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద రూ.1,682 కోట్లు విడుదలచేసింది. 2020 అక్టోబర్‌లో హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తటంతో అపార నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. బాధితులను ఆదుకొనేందుకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్రానికి అప్పుడే లేఖ రాశారు. ప్రాథమిక అంచనాల మేరకు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాలని ప్రధానికి కూడా స్వయంగా విజ్ఞప్తిచేశారు. దీనిపై కేంద్రం ఇప్పటివరకూ స్పందించనేలేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎంత సాయం చేయాలనేది నిర్ణయించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీ ఈ నెల 3న ఢిల్లీలో సమావేశమై 2021లో రాష్ర్టాల నుంచి వచ్చిన అభ్యర్థనలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని నిధులు కేటాయించింది. 18 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా కనీసం పట్టించుకోవటంలేదు.

ఉద్దేశపూర్వకంగానే వివక్ష
2020లో సంభవించిన భారీ వరదలకు హైదరాబాద్‌ నగరంలో అనేక కాలనీలు నీట మునిగాయి. గత వందేండ్లలో రెండో అత్యధిక వర్షపాతం (ఒకే రోజు 32 సెంటీమీటర్లు) నమోదుకావటంతో లక్షల మంది ప్రభావితమయ్యారు. యుద్ధప్రాతిపదికన స్పందించిన సీఎం కేసీఆర్‌, ముంపు బాధితులకు బియ్యం, నిత్యావసరాలతోపాటు ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున నగదును కూడా అందించారు. బాధితులను ఆదుకొనేందుకు ఆర్థికసాయం చేయాలని అదే నెలలో ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఆ తర్వాత 25 రోజులకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కూడా వరద సాయంపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ, కేంద్రం ఇప్పటివరకు నయాపైసా ఇవ్వలేదు.

Post a Comment

 
Top