తెలంగాణ‌లో పెరిగిన చికెన్ ధ‌ర‌లు.. కార‌ణం ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధ‌మే

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో చికెన్ ధ‌ర‌లు కొండెక్కాయి. సామాన్యుడు చికెన్ తిన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కిలో చికెన్‌పై రూ. 100 పెరిగింది. ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా కిలో చికెన్ ధ‌ర రూ. 280 నుంచి రూ. 300 దాకా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అమాంతంగా చికెన్ ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణం ఉక్రెయిన్ – ర‌ష్యా మ‌ధ్య యుద్ధ‌మే కార‌ణ‌మ‌ని హ్యాచ‌రీస్ య‌జ‌మానులు పేర్కొంటున్నారు.

పెరిగిన కోళ్ల దాణా ధ‌ర‌లు

బాయిల‌ర్ కోళ్ల‌కు ప్ర‌ధానంగా మొక్క‌జొన్న‌, సోయాబీన్‌ను ఆహారంగా ఇస్తుంటారు. అయితే ఈ రెండింటి ధ‌ర‌లు అమాంతం పెరిగిపోయాయి. కొద్ది వారాల క్రితం కిలో సోయాబీన్ ధ‌ర రూ. 40 ఉండ‌గా, ఇప్పుడు దాని ధ‌ర రూ. 70 ప‌లుకుతోంది. కిలో మొక్క‌జొన్న ధ‌ర రూ. 20 నుంచి రూ. 27కు ఎగ‌బాకింది. దీని ధ‌ర రూ. 30 దాకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని పౌల్ట్రీ బ్రీడ‌ర్స్ చెబుతున్నారు.

మ‌రి దాణా ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణ‌మేంటి?

మొక్క‌జొన్న‌, సోయాబీన్ ధ‌ర‌లు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఉక్రెయిన్ – ర‌ష్యా మ‌ధ్య యుద్ధ‌మే అని వెంక‌టేశ్వ‌ర హ్యాచ‌రీస్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కేజీ ఆనంద్ పేర్కొన్నారు. ఇండియాలో మొక్క‌జొన్న‌, సోయాబీన్ పండిస్తున్న రైతులు.. స్వ‌దేశంలోనే మార్కెట్ చేసుకుంటున్నారు. అయితే ఉక్రెయిన్ కూడా ఈ రెండు పంట‌ల‌ను అధికంగా పండిస్తోంది. ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేస్తోంది. యుద్ధం నేప‌థ్యంలో ఉక్రెయిన్ నుంచి మొక్క‌జొన్న‌, సోయాబీన్ ఎగుమ‌తులు ఆగిపోయాయి. దీంతో ఇత‌ర దేశాలు.. ఇండియాను ఆశ్ర‌యించాయి. ఈ క్ర‌మంలో సోయా, మొక్క‌జొన్న‌కు భారీ డిమాండ్ వ‌చ్చింది. ఇండియా నుంచి ఇత‌ర దేశాల‌కు సోయా, మొక్క జొన్న ఎగుమ‌తులు ప్రారంభ‌మ‌య్యాయి. త‌ద్వారా ధ‌ర‌లు పెరిగిపోవ‌డంతో, చికెన్ ధ‌ర‌లు కూడా ఆకాశాన్నంటాయ‌ని కేజీ ఆనంద్ తెలిపారు.

కొద్ది నెల‌ల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి!

చికెన్ ధ‌ర‌లు ఇప్ప‌ట్లో త‌గ్గే అవ‌కాశం లేదు. ఈ ప‌రిస్థితి రాబోయే కొద్ది నెల‌ల వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ‌ పౌల్ట్రీ బ్రీడ‌ర్స్ అసోసియేష‌న్ తెలిపింది. ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధంతో పాటు వేస‌కి కూడా తోడైంది. వేస‌విలో కోళ్ల మ‌ర‌ణాలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా చికెన్ రేటు పెరుగుదలకు దోహదపడుతోంద‌ని పేర్కొంది.

Post a Comment

 
Top