సియోల్‌: ఉత్తర కొరియా బుధవారం తన రాజధాని నగరం నుంచి ప్రయోగించిన క్షిపణి గాలిలో పేలిపోయి విఫల ప్రయోగంగా మిగిలింది. తన అమ్ములపొదిలోని అతిపెద్ద, సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణిని ఉత్తర కొరియా త్వరలో ప్రయోగిస్తుందన్న ఊహాగానాల మద్య జరిగిన ఉదంతంగా దీనిపై దక్షిణ కొరియా సైన్యం స్పందించింది. క్షిపణి ప్రయోగం గురించి ఇతర వివరాలేవీ తక్షణం తెలియరాలేదు. ఈ ఏడాది ఉత్తర కొరియా జరిపిన వాటిలో ఇది పదో ప్రయోగం. ఓ వైపు తన ఆయుధాలను ఆధునికీకరించుకొంటూనే నిద్రాణంగా ఉన్న అణు నిరాయుధీకరణ చర్చల మధ్య రాయితీల కోసం ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావాలన్నది ఉత్తర కొరియా వ్యూహంగా కనిపిస్తోంది. ఉత్తర కొరియా క్షిపణి 20 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయింది. దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఈ ప్రయోగం వివరాలను విశ్లేషిస్తున్నాయి. 

Post a Comment

 
Top