నీచానికి ఒడిగడుతుండ్రు..

మార్ఫింగ్‌తో నగ్న ఫొటోలు పంపి వేధింపులు
రుణం చెల్లించినా ఆగని టార్చర్‌
దిగజారుతున్న రుణయాప్‌ నిర్వాహకులు
ఫోన్‌ కాంటాక్ట్స్‌ యాక్సెస్‌ ఇవ్వొదంటున్న పోలీసులు

సిటీబ్యూరో, మార్చి 16: చైనా రుణ యాప్‌ సంస్థలు బరితెగిస్తున్నాయి. మొన్నటి వరకు దుర్భాషలాడుతూ హింసించిన ప్రతినిధులు..మరింత నీచానికి ఒడిగడుతున్నారు. ఏకంగా మార్ఫింగ్‌తో నగ్న ఫొటోలను సృష్టించి.. పరువు తీస్తున్నారు. దీంతో బాధితులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రుణ యాప్‌ సంస్థలు వేధిస్తే.. తమకు ఫిర్యాదు చేయాలని, చర్యలు తీసుకుంటామని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు భరోసా ఇస్తున్నారు.

అవసరాల కోసం రూ. 4వేలు తీసుకుంటే..
ఎల్బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన అవసరాల కోసం రూ. 4వేలు ఆన్‌లైన్‌లో ఓ రుణ సంస్థ నుంచి అప్పు తీసుకున్నాడు. ఆ సమయంలో యాప్‌ ప్రతినిధులు ఐదు నిమిషాల్లోనే రుణం ఇస్తామని చెప్పి.. అతడి ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్‌తో పాటు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అయితే వడ్డీతో సహా తీసుకున్న రుణం చెల్లించినా.. వేధింపులు ఆగలేదు. అతడి కాంటాక్ట్స్‌ లిస్టులోని ఒకరి పేరు చూసి..అతడి అన్న అయ్యి ఉంటాడని భావించి..స్నేహితుడికి కొన్ని మార్ఫింగ్‌తో రూపొందించిన నగ్న ఫొటోలను పంపారు. నీ తమ్ముడు మా దగ్గర తీసుకున్న అప్పును చెల్లించేలా ఒత్తిడి చేయాలని మెసేజ్‌ చేశారు. ఓ సందర్భంలో కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు మార్ఫింగ్‌ చేసి పంపడంతో ఆందోళనకు గురయ్యాడు. తన స్నేహితుడే ఇలా చేస్తున్నాడనుకొని.. బాధితుడు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. రుణం తీసుకున్న వ్యక్తిని పిలిపించి.. ఆరా తీయగా రుణ యాప్‌ వేధింపుల విషయం బయటికి వచ్చింది. దీంతో రుణయాప్‌ సంస్థల పనిపట్టేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అక్క రుణం తీసుకుంటే..
ఖమ్మంలో ఉంటున్న ఓ యువతి ఆన్‌లైన్‌ రుణ యాప్‌లో రూ. 5వేలు లోన్‌ తీసుకుంది. ఆ తర్వాత పూర్తిగా చెల్లించినా.. వేధింపులు ఆగలేదు. మార్ఫింగ్‌ చేసిన అశ్లీల ఫొటోలను బాధితురాలి కాంటాక్ట్స్‌ జాబితాలో ఉన్నవారందరికీ పంపారు. బాధిత యువతి చెల్లెలి స్నేహితురాలు వాటిని చూసి కంగుతిన్నది. విషయాన్ని బాధితురాలికి తెలపడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ క్రమంలో ఆమె సోదరి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది.

అలా చేయకండి…
రుణాలు ఐదు నిమిషాల్లో వస్తుండటంతో చాలా మంది రుణ యాప్‌ సంస్థలు అడిగిన ఫోన్‌ కాంటాక్ట్స్‌ను యాక్సెస్‌ అవకాశం ఇచ్చేస్తున్నారు. దీనిని అవకాశంగా మార్చుకొని.. వేధిస్తున్నారు. అందుకే తొందరపడి అన్నింటికీ యాక్సెస్‌ ఇవ్వవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కాగా, దర్యాప్తులో ఆ రుణ యాప్‌ సంస్థల ఐపీ అడ్రస్సులు విదేశాల్లో ఉంటున్నట్లు తేలింది. అయినా.. వేధింపులకు చెక్‌ పెట్టేందుకు రాచకొండ, సైబరాబాద్‌, హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.

Post a Comment

 
Top