
అమలాపురం పట్టణం: అమలాపురం పట్టణంలోని మహిపాల వీధిలో శ్రీలక్ష్మీగణపతి ఆలయం వద్ద మాయమైన వినాయకుడి విగ్రహాన్ని గంటల వ్యవధిలో పోలీసులు తిరిగి చేర్చారు. గుర్తు తెలియని దుండగులు విగ్రహం తీసుకెళ్లారని స్థానికుల ద్వారా బుధవారం ఉదయం అందిన సమాచారంతో పట్టణ సీఐ షేక్ బాజీలాల్ అప్రమత్తమయ్యారు. ఆ దుండగుల కోసం సిబ్బందితో జల్లెడపట్టారు. చివరకు బాలయోగి ఘాట్ సమీపంలో విగ్రహం ఉన్నట్లు గుర్తించారు. డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఆ విగ్రహాన్ని ఆలయం వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఆలయం వద్ద సీసీ టీవీ పుటేజీలో మంగళవారం రాత్రి రెండు వాహనాలపై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వచ్చి విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించామన్నారు. జరిగిన సంఘటనపై ఆలయ అభివృద్ధి కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయాలు, చర్చి, మసీదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామీణ సీఐ రాంబాబు, పట్టణ, గ్రామీణ ఎస్సైలు రాజేష్, పరదేశి పాల్గొన్నారు.

గణపతి విగ్రహం
Post a Comment