డిగ్రీలు ఉంటే స‌రిపోదు.. క‌ష్ట‌ప‌డి చ‌దివితేనే ఉద్యోగం : మంత్రి మ‌ల్లారెడ్డి

హైద‌రాబాద్ : యువ‌త‌కు డిగ్రీలు ఉంటే స‌రిపోదు.. క‌ష్ట‌ప‌డి చ‌దివితేనే ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌స్తుంద‌ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి స్ప‌ష్టం చేశారు. మంచి ఉద్యోగంతో పాటు మంచి పార్ట్‌న‌ర్‌ను సంపాదించుకోవాల‌ని మంత్రి సూచించారు. త‌న ప్ర‌సంగంతో ఉద్యోగ అభ్య‌ర్థుల్లో మ‌ల్లారెడ్డి జోష్ నింపారు. పీర్జాదిగూడ ప‌రిధిలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

ప్ర‌పంచంలో ఉన్న టాప్ ఇంజినీర్లు, డాక్ట‌ర్లు, సైంటిస్టులు మ‌న తెలంగాణ వారే. తెలుగు వారికి తెలివితేట‌లు ఎక్కువ‌. స్కిల్, చాలెంజ్‌తో పాటు క‌సి ఎక్కువ‌. యువ‌త‌కు గ‌త గ‌వ‌ర్న‌మెంట్లు మ‌ద్ద‌తు తెలుప‌లేదు. అందుకే ఇత‌ర దేశాల‌కు వెళ్లి సెటిల‌య్యారు. మ‌న కేసీఆర్ సీఎం అయ్యాక‌, యువ‌త‌, తెలివిప‌రులు మ‌న ద‌గ్గ‌రే ఉండాలని, తెలంగాణ‌ను అభివృద్ది చేసుకోవాల‌నే ఉద్దేశంతో యువ‌త‌కు ఇక్క‌డే ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నారు. ప్ర‌పంచంలోని టాప్ మోస్ట్ కంపెనీల‌ను కేటీఆర్ రాష్ట్రానికి తీసుకొచ్చారు. మ‌న వ‌ద్ద ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు ఉద్యోగాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని మంత్రి మ‌ల్లారెడ్డి తెలిపారు.

వాళ్ల ఇంగ్లీష్ బిత్త‌ర‌బిత్త‌ర‌గా ఉంటుంది..

మ‌న విద్యార్థుల ఇంగ్లీష్ ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంట‌ద‌ని మ‌ల్లారెడ్డి పేర్కొన్నారు. చైనా, జ‌పాన్ వాసులు ఇంగ్లీష్ మాట్లాడితే బిత్త‌ర‌బిత్త‌ర‌గా ఉంటుంది. కానీ మ‌న ఇంగ్లీష్ ప్ర‌తి ఒక్క‌రికి అర్థ‌మ‌వుతుంది. అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పించి, కోచింగ్ ఇప్పిస్తున్నాం. ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్ర‌భుత్వ ఉద్యోగాలు మీకంద‌రికి రావాల‌ని కోరుకుంటున్నాన‌ని మంత్రి మ‌ల్లారెడ్డి పేర్కొన్నారు.

భ‌విష్య‌త్‌, ప్ర‌పంచ‌మంతా మీదే..

ఒకానొక‌ప్పుడు పాలు అమ్మి, బండ‌లు అమ్మి జీవ‌నం కొన‌సాగించాన‌ని మంత్రి మ‌ల్లారెడ్డి తెలిపారు. ఇప్పుడు మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు న‌గ‌రానికి వ‌చ్చాయి. భ‌విష్య‌త్ అంతా మీదే, ప్ర‌పంచ‌మంతా మీదే. మ‌ళ్లీ జ‌న్మ‌లేదు. స‌క్సెస్ కావాలి. మీరు క‌ష్ట‌ప‌డితే మీకే మంచిది. సీరియ‌స్‌గా క‌ష్ట‌ప‌డాలి. తెలంగాణ‌లో గొప్ప అవ‌కాశాలు ఉన్నాయని చెప్పారు.

టెక్నాల‌జీ అంటే తెలివి.. యాపిల్ లాగే అప్‌గ్రేడ్ కావాలి..

ప్ర‌పంచంలోని చాలా మంది టెక్నాల‌జీని వాడుకొని ప్ర‌పంచ కుబేరులు అయ్యారని మంత్రి మ‌ల్లారెడ్డి గుర్తు చేశారు. టెక్నాల‌జీ అంటే తెలివితో ప‌ని చేయాలి. యాపిల్ కంపెనీ ఉంది. ఒక యాపిల్ ఫోన్ రూ. 2 వేల వ‌ర‌కు త‌యార‌వుతుంది. ఆ ఫోన్‌ను మాత్రం రూ. ల‌క్ష వ‌ర‌కు అమ్ముతుండు. 2జీ, 3జీ, 4జీ, 5జీ అని అప్‌గ్రేడ్ చేసుకుంటూ అధిక ధ‌ర‌కు అమ్ముతున్నారు. అలా మ‌నం కూడా అప్‌గ్రేడ్ కావాలి. అదృష్టం అనేది మ‌న చేతుల్లోనే ఉంది. మీ కోసం మీరు క‌ష్ట‌ప‌డాల్సిందే. డిగ్రీ స‌ర్టిఫికెట్ ఉంటే స‌రిపోదు. అప్‌గ్రేడ్ అవుతేనే స‌క్సెస్ అవుతాం. దూకుడు పెంచాలి. లేక‌పోతే మీ భ‌విష్య‌త్‌కు ప్ర‌మాదం ఉంటుంది. మీకు అధిక జీతాలు వ‌స్తే మంచి పార్ట్‌న‌ర్, బంగ్లా దొరుకుతుందని ఉద్యోగ అభ్య‌ర్థుల్లో మంత్రి మ‌ల్లారెడ్డి జోష్ క‌ల్పించారు.

Post a Comment

 
Top