కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణం

మృతదేహంతో జగిత్యాలలో బంధువుల ఆందోళన

జగిత్యాల, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అదనపు కట్నం తేవాలని వేధించడంతో వివాహిత నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కాంపెల్లి మమత (24), రమేశ్‌లు ప్రేమించుకోగా 2018లో పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. పెళ్లయిన ఏడాదిన్నరకు పాప, బాబు కవల పిల్లలు జన్మించగా కొన్నాళ్లకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో మమత సోమవారం రాత్రి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోగా తీవ్ర గాయాలయ్యాయి. మొదట జగిత్యాల జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. మృతురాలి బంధువులు జగిత్యాలకు వచ్చి పాతబస్టాండ్‌ ఎదురుగా మధ్యాహ్నం మృతదేహంతో ఆందోళనకు దిగారు. గంటసేపు ఆందోళన చేయగా డీఎస్పీ ఆర్‌.ప్రకాష్‌, పట్టణ సీఐ కె.కిషోర్‌ వారితో మాట్లాడి ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. వివాహ సమయంలో కట్న కానుకలిచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా మమత భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. తన కుమార్తె మమతను అత్తమామలు రాజవ్వ, లక్ష్మణ్‌ భర్త రమేష్‌, బావ మహేష్‌లు కిరోసిన్‌ పోసి నిప్పంటించి హతమార్చారని మమత తల్లి నక్క సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

 
Top