
దేశంలోని చాలా నగరాల్లో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య. దీని వల్ల వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటి సమస్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఆరేళ్ల బాలుడికి ఎదురైంది. అయితే, అతడు చూస్తూ ఊరుకోలేదు. ‘స్కూల్ వద్ద ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. మీరు వచ్చి క్లియర్ చేయండి’ అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. పోలీసులతో ఆ బుడతడు మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన కార్తీక్ యూకేజీ చదువుతున్నాడు. స్కూల్ ప్రాంతంలో డ్రైనేజీ పనులు, ట్రాక్టర్ల కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్ భాస్కర్‌కు ఫిర్యాదు చేశాడు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌ను వచ్చి ట్రాఫిక్ సమస్య తీర్చాలని కోరాడు.
అతడి మాటలు విని పోలీసులు మొదట ఆశ్చర్యపోయారు. అనంతరం బాలుడి ధైర్యానికి మెచ్చుకున్నారు. వెంటనే తమ వద్ద ఉన్న స్వీట్లను బాలుడికి ఇచ్చారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయాలని చెప్పి, సీఐ తన నంబర్‌కూడా ఇచ్చాడు. ఈ వీడియో చూసినవారంతా బాలుడి మాటలకు ఫిదా అవుతున్నారు. అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
Post a Comment