
- ప్రణాళికాబద్ధంగా నగర నిర్మాణం
- భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు
యాదాద్రి, మార్చి 21: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతోపాటు ఆలయ నగరిని మరింత విస్తృతితో, విశేషాలతో తీర్చిదిద్దుతున్నారు. ఆలయం, ఆలయ నగరం రెండింటి నిర్మాణం ఒకేసారి చేపట్టడం సాహసమే. ఆలయానికి అంతకు ముందున్న ఇరుకైన స్థలాన్ని విశాలం చేసేందుకు దక్షిణం వైపునుంచి నూరడుగుల విస్తృతిని పెంచి, కుడ్య నిర్మాణం చేసి, దాని ఎత్తుకు తగ్గట్టు సమతలమయ్యేలా భూతలం పెంచి ఒక ఆకాశహర్శ్యం మాదిరి నిర్మించారు. గుట్ట కింద ఆలయ నగరాన్ని 1,100 ఎకరాలకు ప్రణాళికచేసి, 832 ఎకరాలను ఇప్పటికే సేకరించారు.
గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు
యాదాద్రి కింద రింగ్ రోడ్ 160 మీటర్ల వెడల్పుతో ఏర్పాటుచేశారు. 2.7 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ మార్గం, 5 కిలోమీటర్ల దూరంనుంచే విశాలమైన కన్నులకింపైన రహదారులు, పాదచారుల బాటలు, మధ్యలో మొక్క లు, రాయగిరి నుంచి గుట్ట వరకు పచ్చిక బయళ్ళు- ఇలా అత్యంత సుందరంగా నిర్మించారు. రాయగిరి దగ్గర నృసింహ అభయారణ్య నిర్మాణం జరుగుతున్నది. జూ పార్కు (అరణ్య జీవి వనం), అమ్యూజ్‌మెంట్ పార్కు రాయగిరి రోడ్డు పక్కన ఏర్పాటవుతున్నాయి.
ఆకాశమార్గంలో మాడవీధులు
ఇక్కడ యాదాద్రిలో ప్రధాన నరసింహాలయంతోపాటు పాతగుట్ట నరసింహాలయమున్నది. ఇదే ముందు వెలసిన స్వామి. యాదయ్య ఈ గుహనారసింహుడిని స్వయంభువుగా తన ప్రార్థనతో మెప్పించి వెలయింపచేశారు. ఈ పాతగుట్ట నరసింహునికి కూడా బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఐతే ఇది సప్తాహ్నికం. అనగా ఏడు రోజుల క్రతువు. కొత్త (ప్రధాన) నారసింహుడి బ్రహ్మోత్సవాలు నవాహ్నికం అనగా తొమ్మిది రోజులు. ఇవి ఫాల్గుణ మాసంలో జరుగుతాయి. వీటిలో భాగమైన రథోత్సవం పైన విశాలమైన మాడవీధులలో జరుగుతుంది. ఈ మాడవీధులు కూడా ఆకాశమార్గమే. నూతన ఆలయంలో భాగంగా నిర్మితం. ఈ ఉత్సవాలలో యాభైవేల మంది భక్తులు ఒకేసారి పాల్గొన్నా ఇబ్బంది లేనంత విస్తృతంగా నిర్మాణం జరిగింది. మాడవీధుల్లో పశ్చిమోత్తరాల మధ్య వాయవ్య కోణాన రథశాలతోపాటు ఆధునిక దేవాలయంలో భాగంగా ఆలయరథం నిర్మించారు. కొత్త ఆలయ నిర్మాణంలో వీటన్నిటికి జాగ్రత్తలు తీసికోవడంతోపాటు భక్తుల సౌకర్యాలు కల్పించారు.

నారసింహుడికి కాళేశ్వర జలాలు
యాదాద్రికి వచ్చిన భక్తులు గోదావరి జలాలతో పవిత్ర స్నానాలు చేయడానికి ఏర్పాటు చేశారు. కాళేశ్వరం జలాలు జగదేవ్‌పూర్ నుంచి బస్వాపూర్ రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. ఈ నీరు బస్వాపూర్ చేరుకోకముందే నలభై కిలోమీటర్ల దగ్గర సైదాపూర్ కాలువ నిర్మించారు. ఈ కాలువ మీద ఎనిమిదిన్నర కిలోమీటర్ల దగ్గర నుంచి రెండు మీటర్ల పొడవైన పైప్‌లైన్ నిర్మిస్తున్నారు. నీరు కలుషితం కాకుండా స్వచ్ఛత కాపాడటానికి పైప్ లైన్ వేశారు. యాదాద్రిలోని గండి చెరువును గోదావరి నీటితో ఇది నింపుతుంది. ఈ నీటితో ఎప్పటికప్పుడు యాదాద్రి గుట్టకింద భక్తులు స్నానం చేసే లక్ష్మీ పుష్కరిణి, పైన కొండ మీది విష్ణు పుష్కరిణి స్వామివారి కోసం నింపుతుంటారు. ఈ పుష్కరిణులు నిరంతరం ఖాళీ చేస్తూ కొత్త నీటితో నింపడం వల్ల భగవంతుడికి, భక్తులకు స్వచ్ఛమైన జలాలు లభిస్తాయి. పెద్దగుట్టపై 250 ఎకరాలలో టెంపుల్ సిటీని పచ్చదనంతో తీర్చిదిద్దుతున్నారు. 25 ఎకరాల్లో పార్క్‌లను తీర్చిదిద్దుతూ, మొక్కలు నాటారు. 60 రకాలకు చెందిన రెండు లక్షల మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నారు. ప్రదక్షిణ రహదారికి ఇరువైపులా అందమైన మొక్కలు నాటారు. సువిశాలమైన రోడ్లు, పచ్చదనం ఉట్టిపడేలా పార్కులను అభివృద్ధి చేశారు. పెద్దగుట్ట పైకి వెళ్ళడానికి ప్రత్యేకంగా మూడు ఘాట్ రోడ్లు నిర్మించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు రెండు మూడు రోజులపాటు ఉండేలా వసతి గృహాలు, ఇతర వసతులు చేపట్టారు. టెంపుల్ సిటీలో 250 డోనర్ల కాటేజీలను నిర్మించనున్నారు.
ఉత్తరాన వేంచేపు మంటపం
గుడి, నగరిలో మరికొన్ని ముఖ్యనిర్మాణాలున్నాయి. మాడవీధుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించినప్పుడు ప్రతి ప్రదక్షిణాసేవ తరువాత స్వామివారు కూర్చునే ప్రదేశం వేంచేపు మంటపం. దీని నిర్మాణం ఉత్తరాన పూర్తి అయింది. స్వామివారు ఇక్కడ ఆసీనులై ఉన్నప్పుడు రథోత్సవ విధులు, విశేష వాహన పర్యటనలు నిర్వహిస్తారు. అవి ఇక్కడి నుండే ప్రారంభమై మాడవీధులలో ప్రదక్షిణించి ఇక్కడికే చేరుకుంటాయి. ఇది ఉత్సవ మూర్తులైన శ్రీలక్ష్మీ నారసింహులకు ఒక తాత్కాలిక విశాల మంటపం. ఈ వేంచేపు మంటపం పడమటి రాజగోపురం ముందు భాగంలో ఉన్నది. తూర్పున బ్రహ్మోత్సవాల కోసం ఓ మంటపం నిర్మాణమయింది. ముక్కోటి ఏకాదశినాడు ఉత్తరద్వారం గుండా స్వామి దర్శనం ఓ విశిష్ట సంప్రదాయం. దానికి తగ్గట్టు ప్రాకార, ప్రదక్షిణాపథ కుడ్యాల్లో ఉత్తరద్వారం నిర్మాణాలు విశేషాకర్షణగా నిలుస్తున్నాయి.

కొండ కింద స్నానగుండం కొండ కింద గండి చెరువు దగ్గర లక్ష్మీ పుష్కరిణి పేరుతో ఆలయానికి దూరంగా నగరులో భారీ స్నానగుండం నిర్మిస్తున్నారు. ఇక్కడ భక్తులు ఒకేసారి 2,500 మంది స్నానించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు రూ.11.5 కోట్లతో 2.47 ఎకరాల విస్తీర్ణంతో, 15 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో నిర్మాణం జరుగుతున్నది. షవర్లు (తల స్నానాలు), దుస్తులు మార్చుకొనే గదులు నిర్మాణమవుతున్నాయి.
అధునాతన వ్రత మంటపం
సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి ఆధునాతన వ్రత మంటప నిర్మాణం జరిగింది. రూ. 17.8 కోట్లతో ఈ మంటపాన్ని నిర్మించారు. దీని విస్తీర్ణం
80 వేల అడుగులు. రెండు సభా భవనాలుగా విభజించి నిర్మించిన వీటిలో ఒక్కో దానిలో రెండు వందల యాభై జంటలు కూర్చొని వ్రతం చేసుకోవచ్చు. బయట సాలాహారాల్లో శిల్పాలతో అలంకరించి లోపల గోడకు సత్యనారాయణస్వామి విగ్రహాన్ని, వ్రతమంటప దారిలో స్వాగత తోరణాలను అందంగా అలంకరించారు.

రహదారి అంతా వెలుగుదివ్వెలు
హెలిప్యాడ్, చిన్న విమానాలు దిగడానికి ఏర్పా ట్లు, రైల్వేస్టేషన్ నుండి వచ్చే యాత్రికులకు రోడ్డు ఇలా సకల రవాణా సౌకర్యాలు సమకూరుస్తు న్నారు. రాత్రి వెలుగుల జిలుగులతో మెరియడానికి, అనుసంధాన రహదారులు మొదలుకొని, పర్వతానికి, ఆలయానికి, ఆలయాంతర్భాగాలకు విద్యుదీకరణ చేశారు. 880 అడుగుల నిడివిగల క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. లోహ కుడ్యాలు, జాలీలతో బయటి ప్రపంచం కనపడేలా చేశారు. మధ్యలో శంఖ, చక్ర, తిరునామ, ఐరావతాదులు, దేవతామూర్తుల రూపాలతో, బంగారు రంగుపూతతో మెరిసేలా ఇండోర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన లోహపు లోగిళ్లు నిర్మించారు. ఇరవై వేల మంది ఒకేసారి వీటి నుంచి స్వామివారి ఆలయపు వాకిట దర్శనం కొరకు ఎదురు చూడవచ్చు. ఇక్కడ మంచినీరు, ఏసీ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
క్యూలో నిలుచున్న భక్తులకు తూర్పు మాడ వీధి వైశాల్యం రాతి సప్తతల గోపురం కన్నుల పండువగా కనిపిస్తాయి. ఇక్కడే మూడు అంతస్తుల పోటు (ప్రసాదాల తయారీ కేంద్రం) నిర్మితమైంది. దీనిలో నుంచి ప్రసాద విక్రయశాలకు, స్వామి వారికి ప్రసాద నివేదనానికి పంపేందుకు లిఫ్టు సౌకర్యమున్నది. దక్షిణపు ప్రదక్షిణాపథంలోని ద్వారం గుండా గర్భాలయంలోకి నివేదనకై వంటకాలు పూజారులు తీసుకుని వెళ్లొచ్చు. భక్తుల తాకిడికి దూరంగా పవిత్రంగా తీసుకొని వెళ్లే ఏర్పాటున్నది. దీని కోసం స్వామి గర్భగుడి చుట్టూ సంక్షిప్త ప్రదక్షిణా పథంగా అర్చకులు మాత్రం నడిచేలా రెండున్నర అడుగుల వెడల్పుతో ఏర్పాటుచేశారు. ఈ పథంగుండా అష్ట దిశలా బలిహరణాలు కూడా అర్చకులు పెట్టుకోవచ్చు. ఈ లఘుపథ నిర్మాణంలో స్వామి వారు వెలసిన పర్వత శిలను ఎక్కడా చెడగొట్టకుండా గుట్టకు గల పావిత్య్రాన్ని కాపాడినారు.

సకల సౌకర్యాల నగరి
ఆలయంలో శిల్పం, సౌందర్యం, ఆగమశాస్త్ర నిబద్ధతవలెనే గుట్టమీద ఆలయం చుట్టూరా ప్రాంతంతోపాటు, కింద ఆలయ నగరిలో విశాలత, భక్తకోటికి సౌకర్యాల కోసం నిబద్ధమైన ప్రణాళికలు ఏర్పరిచారు. వసతి భవనాలు, పెండ్లిళ్లకు కళ్యాణ మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం, విస్తృత పుష్కరిణి, కళ్యాణకట్ట (తల నీలాలిచ్చే మంటపాలు), ‘అతి ముఖ్యుల’ కోసం వసతి భవనాలు, లంకె రహదారులు, లిఫ్టులు, క్యూ కాంప్లెక్స్‌లు, పార్కింగ్ ప్లేస్‌లు, రింగ్ రోడ్డులు, మెట్ల దారి, ఆ మెట్ల దారిలో సౌకర్యాలు, గిరి ప్రదక్షిణా పథాలు, పచ్చిక బయళ్లు, నిత్యాన్నదాన మందిరాలు- వాటి వంటశాలలు, ప్రసాద విక్రయశాలలు- ఇలా ఆలయ నగరిలో అనేక విధాల నిర్మాణాలు భవిష్యత్తులో భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్మితమయ్యాయి. ఒకేసారి 1000 మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. 300 గదులను తులసికోట దగ్గర నిర్మాణం చేసారు. 1300 ఎకరాల్లో అతిముఖ్య సందర్శకుల బస కోసం వసతి భవనాలు ఒక్కొక్కటి ఏడున్నర కోట్ల రూపాయల విరాళాల సేకరణతో కట్టించారు. పైన ప్రధానాలయంతోపాటు పాత పుష్కరిణి స్థానంలో విష్ణు పుష్కరిణిని సిద్ధంచేశారు. దీనిలోనే తెప్పోత్సవం, చక్రతీర్థాది బ్రహ్మోత్సవాల సంప్రదాయ విధులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Post a Comment