LPG Gas | గ్యాస్ బండ బుకింగ్ కోసం వాయిస్ బేస్డ్ పేమెంట్స్.. ఎక్క‌డంటే?!

LPG Gas | కేంద్ర ప్ర‌భుత్వ రంగ చ‌మురు సంస్థ.. భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (బీపీసీఎల్‌) త‌న వినియోగ‌దారుల కోసం సానుకూల నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇంట‌ర్నెట్‌, స్మార్ట్ ఫోన్ లేకున్నా ఎల్పీజీ గ్యాస్ వాడ‌కం దారుల‌కు వాయిస్ ఆధారిత డిజిట‌ల్ పేమెంట్ ఫెసిలిటీని గురువారం ప్రారంభించింది. ఇందుకోసం ఆల్ట్రా క్యాష్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌తో బీపీసీఎల్ జ‌త క‌ట్టింది. స్మార్ట్ ఫోన్ లేదా ఇంట‌ర్నెట్ లేని భ‌ర‌త్ గ్యాస్ క‌న్జూమ‌ర్లు ఎల్పీజీ సిలిండ‌ర్‌ను బుక్ చేసి `యూపీఐ 123 పే` ద్వారా చెల్లింపులు చేయొచ్చు.

ఈ ఫెసిలిటీతో దేశ‌వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని నాలుగు కోట్ల మంది ఖాతాదారుల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని భ‌ర‌త్ గ్యాస్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. వాయిస్ ఆధారిత డిజిట‌ల్ పేమెంట్స్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చిన తొలి సంస్థ‌గా బీపీసీఎల్ నిలిచింది. ఆఫ్‌లైన్‌లోనూ డిజిట‌ల్ చెల్లింపుల‌కు యూపీఐ123పే విధానాన్ని గ‌త‌వారం ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫెసిలిటీ కోసం నేష‌న‌ల్ పేమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆమోదంతో ఆల్ట్రా క్యాష్ టెక్నాల‌జీస్ ఒక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తుంది.

ఫీచ‌ర్ ఫోన్ నుంచి 080-4516-3554 నంబ‌ర్‌కు కాల్ చేసిన వారికి భ‌ర‌త్ గ్యాస్ బుక్ అవుతుంది. అంతేకాదు సుర‌క్షితంగా బిల్లు పేమెంట్స్ ఈజీ స్టెప్స్‌కూడా అందుబాటులో ఉన్నాయి. ఫీచ‌ర్ ఫోన్ల‌లో డిజిట‌ల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవ‌డంతో గ్రామీణుల్లో విశ్వాసం పెరుగుతుంద‌ని బీపీసీఎల్ తెలిపింది.

Post a Comment

 
Top