మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా శాంతిఖని గనిలో కాంట్రాక్టు కార్మికుడు కందుల లక్ష్మీనారాయణ(40) ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గనిలో అత్యంత ప్రమాదకరమైన రూఫ్ బోల్టింగ్ పనుల నిర్వహణకు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి యాజమాన్యం పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్టలను అప్పజెపిన విషయం తెలిసిందే. స్థానిక కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి ఏరియా శాంతిఖని గనిలో రూఫ్ బోల్టింగ్ పనులకు సంబంధించి కొత్తగూడెంకి చెందిన మహాలక్ష్మి కంపెనీ టెండర్ సొంతం చేసుకొని స్థానికంగా ఉండే కార్మికులచే పనులను నిర్వహిస్తుందని అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన కందుల లక్ష్మీనారాయణ సోమవారం ఉదయం మొదటి షిఫ్ట్ లో పది గంటల ప్రాంతంలో రూఫ్ బోలట్లను తన భుజం పై మోస్తూ గనిలో పని స్థలానికి వెళ్తుండగా అరవై సిమ్ము బెల్ట్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడట. లక్ష్మినారాయణ రాకకు ఆలస్యం కావడంతో అటువైపుగా వెళ్లి

గమనించిన కార్మికులు అప్పటికే మృతి చెందిన లక్ష్మీనారాయణను గుర్తించి హుటాహుటిన బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలిపారు. కాగా నారాయణను పరిశీలించిన సింగరేణి ఆసుపత్రి వైద్యులు మృతి చెందినట్లుగా గని అధికారులకు తెలిపారు. అప్పటికే ఆసుపత్రిని చుట్టుముట్టిన గట్టి పోలీస్ బందోబస్తు, సింగరేణి ఎస్.అండ్.పిసి ల నడుమ మూడున్నర గంటల నుండీ నాలుగు గంటల సమయంలో ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రికి చేరుకున్న కొన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు గని ఉన్నత స్థాయి అధికారితో కలిసి కొత్తగూడెంలో ఉన్న గుత్తేదారుడితో చరవాని ద్వారా చర్చలు జరిపారు. చర్చల అనంతరం లక్ష్మీనారాయణ చావు ఖర్చులకు లక్ష రూపాయలు, వారం అనంతరం మరో నాలుగు లక్షలు ఇచ్చేందుకు అత్యంత బాధ్యత వహించి గుత్తేదారుడిని ఒప్పించినట్లు, మృతుడి భార్యకు కాంట్రాక్టు పద్దతిలో ఏరియా జిఎం ఆదేశాలతో సివిక్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని స్థానిక కార్మిక సంఘాల నాయకులు, గని అధికారి తెలిపారు. ఇది విన్న కొందరు నాయకులు యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైన కార్మికుడికి ముష్టి వేసినట్లు ఐదు లక్షల ఇవ్వడం పట్ల మండిపడుతునట్లు బహిరంగంగా కనిపించింది. ఈ ఘటన పై హెచ్.ఎం.ఎస్. నాయకులు రియాజ్ అహ్మద్ చురకులు ప్రతినిధితో మాట్లాడుతూ.. గనిలో ప్రమాదవశాత్తు లక్ష్మీనారాయణ అనే కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందినట్లు అసలు విషయం బయటకు రాకుండా ఉండేందుకు అధికారులకు తాబేదార్లుగా మారిన కొందరు కార్మిక సంఘాల నాయకుల నడుమ నాలుగు గోడల మధ్య రహస్య మాటమంతి జరపడం ఏంటో కార్మిక లోకం ఆలోచించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో కేంద్ర రాష్ట్ర రాజకీయ పార్టీల జోక్యంతో చోటామోటా ప్రైవేట్ కాంట్రాక్టర్ల సంఖ్య పెరిగిందని, తద్వారా పూట గడవని నిరుపేద నిరుద్యోగులను నియమనిబంధనలను తుంగలో తొక్కి ఉపాది పేరుతో రక్తం మరకలు ఆరని రాకాసి బొగ్గు గనిలోకి దింపి కాంట్రాక్టర్లు, సింగరేణి యాజమాన్యం కలిసి ఈ హత్యలు చేస్తోందని, వీరికి కోల్ బెల్ట్ లోని రాజకీయ నాయకుల అండ ఉండటం సిగ్గుచేటు అన్నారు. రామగుండం రీజియన్ లో గత నెలల్లో జరిగిన ప్రమాదం కావచ్చు.. అంతకుముందు ముందు జరిగిన పలు ప్రమాదాల్లో కావచ్చు.. మృతి చెందింది సింగరేణి కార్మికులా లేక కాంట్రాక్టు కార్మికులా అంటూ వ్యత్యాసం లేకుండా మానవత్వంతో మృతుల కుటుంబాలకు ముప్పై లక్షలు, మరో ఘటనలో నలభై లక్షల రూపాయలను హెచ్.ఎం.ఎస్. కార్మిక సంఘం డిమాండ్ చేసి ఇప్పించడం జరిగిందని గుర్తు చేశారు. ఆర్జీ రీజియన్ లో మృతి చెందిన వారిలో కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని విధి నిర్వహణలోనే వారు మృతి చెందారని, నేడు మందమర్రి రీజియన్ లో కాంట్రాక్టు కార్మికుడు లక్ష్మీనారాయణ సైతం విధి నిర్వహణలోనే మృతి చెందినట్లు తెలుపుతూ వీరందరిని కార్మికులుగా కాకుండా ఓ కుటుంబ పోషకాలుగా చూడాల్సిన అవసరం అటు సింగరేణి యాజమాన్యానికి, ఇటు రాజకీయ పార్టీల నాయకులకు ఉందని అన్నారు. ఒక చోట నలభై లక్షల ఇచ్చి ఇక్కడ ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటని ప్రశ్నించారు. కార్మికులను వర్గాల వారిగా విభజించే సూత్రం వెనుక యాజమాన్యానికి వారికి తాబేదార్లుగా వ్యవహరిస్తున్న కొందరు ఖద్దరు కార్మిక సంఘాల నేతలకు లాభసాటి వ్యాపారం జరుగుతోందని అన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైన కార్మికుడిని ఆసుపత్రికి తీసుకువచ్చి ప్రాణవాయువు పెట్టి ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని, కొన్ని కార్మిక సంఘాలు కార్మికుల శవాల పై రాజకీయాలు చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో రియాజ్ ధ్వజమెత్తారు. కాగా విధి నిర్వహణలో కార్మికుడు మృతి చెందిన ఘటనతో రాష్ట్రంలోని పలు పౌరహక్కుల సంఘాల నాయకులు న్యాయ విచారణ జరిపించాలని, లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మృతునికి భార్య, పాప ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో భార్య గుండెలవిసేలా రోదించారు.

Post a Comment