పాములను పట్టుకోవడంలోనే కాదు.. వాటి సంరక్షణలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాముల శ్రీనివాస్ చనిపోయారు. శ్రీనివాస్ ఏ పాములనైతే కాపాడుతూ వచ్చారో ఆ పాముల కాటుకు గురై చనిపోవడంతో అందరినీ విషాదంలో ముంచేసింది. వృత్తి సింగరేణిలో అయినా.. ప్రవృత్తి మాత్రం పాములు పట్టడం.
శ్రీనివాస్ అసలు పేరు అనవేన శ్రీనివాస్. మందమర్రి ఏరియాలోని సింగరేణి సివిల్ విభాగంలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 24న స్థానిక సింగరేణి గ్రీన్ పార్కులో హరితహారం కోసం మొక్కలు తీస్తూ అందులో ఉన్న రక్త పింజర పాము కాటుకు గురై కరీంనగర్‌లో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి చనిపోయారు. ఆయనకు భార్య కృష్ణవేణి, కూతుళ్లు స్వాతి, అంజలి ఉన్నారు.
ఖమ్మంలో జరిగిన ఓ సంఘటన శ్రీనివాస్ పాములు పట్టే వృత్తిలో చేరడానికి కారణమైంది. ఓ పాము దిండులో చేరడంతో కుటుంబంలోని నలుగురు వ్యక్తులను కాటు వేసింది. దీంతో వాళ్లు నలుగురు చనిపోయారు. ఈ సంఘటనతో తీవ్ర వేదనకు గురైన శ్రీనివాస్ పాములు పట్టాలని నిర్ణయించుకున్నారు. కొంత కాలంగా ఆయన ఏరియా పర్యావరణ విభాగం పరిధిలో స్థానిక సింగరేణి గ్రీన్ పార్కులో విధులు నిర్వహిస్తున్నాడు. పది సంవత్సరాలుగా ఆయన పాములను పడుతున్నాడు. మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి, సింగరేణేతర ప్రాంతాల్లో పాములను పడుతూ పేరు తెచ్చుకున్నారు. పదేళ్ల కాలంలో వేలాది పాములను పట్టుకున్నారు. ఇప్పటి వరకు 6వేల పాములు పట్టినట్లు చెబుతున్నాడు. ఎక్కడా డబ్బులు తీసుకునే వారు కాదు శ్రీనివాస్. కేవలం పెట్రోల్ ఛార్జీలను మాత్రమే తీసుకునే వారు. తనకు తెలిసిన విద్యను పది మందికి పంచాలనే ఉద్దేశంతో స్నేక్ సొసైటీని ఏర్పాటు చేసి సింగరేణి ప్రాంతాల్లోని పలువురు యువకులకు శిక్షణ సైతం ఇచ్చారు.


Post a Comment